IPL 2022: బాబోయ్ బదోనీ! విరాట్ కోహ్లీనీ వదల్లేదుగా..!
Ayush badoni imitates Virat kohli: ఐపీఎల్ 2022లో యువ క్రికెటర్ ఆయుష్ బదోనీ తన ఐడల్ విరాట్ కోహ్లీని అనుకరించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2022లో యువ క్రికెటర్ ఆయుష్ బదోనీ అదరగొడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చినా దుమ్ము రేపుతున్నాడు. ఒత్తిడంటే ఎలావుంటుందో తెలియదన్నట్టుగా బౌలర్లను చితకబాదుతున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు తన ఐడల్ విరాట్ కోహ్లీని అనుకరించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తోంది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్ వరకు వారి బ్యాటింగ్ డెప్త్ భీకరంగా ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్లో 22 ఏళ్ల కుర్రాడు ఆయుష్ బదోనీ ఆకట్టుకుంటున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ తనదైన ముద్ర వేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో లక్నో టాప్ ఆర్డర్ ఫెయిలయింది. అప్పుడు దీపక్ హుడాతో కలిసి బదోనీ (54) అర్ధశతకం బాదేశాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఇక చెన్నైతో 210+ ఛేదనలోనూ బదోనీది కీలక పాత్ర. 19 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచును గెలిపించాడు. సన్‌రైజర్స్ పైనా అతడి ఆట ముచ్చటేసింది. ఇక దిల్లీ క్యాపిటల్స్‌తో నాలుగో మ్యాచులో ఆడింది కేవలం 3 బంతులే అయినా అందరినీ ఆకట్టుకున్నాడు. ఆఖరి ఓవర్లో 5 పరుగులు చేయాల్సిన తరుణంలో మొదటి బంతికే దీపక్ హుడా ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బంతితో ప్రమాదకరంగా కనిపించాడు. టెన్షన్ పెరిగిపోయింది. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన బదోనీ మాత్రం కూల్‌గా క్రీజులో నిలబడ్డాడు. మొదటి బంతి బౌన్సర్ కాబట్టి వైడ్ అనుకొని నిలబడ్డాడు. కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత బంతిని సింపుల్‌గా కవర్స్‌లో ఇద్దరి ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీకి పంపించాడు. తర్వాత బంతిని సిక్స్ కొట్టేశాడు.
బౌండరీ కొట్టగానే బదోనీ ఇచ్చిన రియాక్షన్స్ అందరినీ ఆకర్షించాయి. అచ్చంగా విరాట్ కోహ్లీని అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నాడు. తన పడికిలితో వెన్నుపై తట్టుకుంటూ పడికిలి బిగించాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
@imVkohli 🤝 Youngsters pic.twitter.com/jeSS7jScqd
— Utkarsh (@_AgarwalUtkarsh) April 8, 2022
దిల్లీ vs లక్నో మ్యాచ్ ఎలా సాగిందంటే?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. క్వింటన్ డికాక్ (80: 52 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
డికాక్ షో...
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఇన్నింగ్స్ మెల్లగా మొదలైంది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ (24: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. మరోవైపు మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 73 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఎవిన్ లూయిస్ (5: 13 బంతుల్లో) కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. ఎవిన్ లూయిస్ అవుటైన మూడు ఓవర్లకే క్వింటన్ డికాక్ కూడా అవుట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది.
అయితే కొట్టాల్సిన స్కోరు తక్కువే ఉండటంతో దీపక్ హుడా (11: 13 బంతుల్లో), కృనాల్ పాండ్యా (19 నాటౌట్: 14 బంతుల్లో, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివర్లో దీపక్ హుడా అవుటైనా ఆయుష్ బదోని (10 నాటౌట్: 3 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.