Harry Brook Suspension: హ్యారీ బ్రూక్ పై బీసీసీఐ వేటు.. నిబంధనలు ఉల్లంఘించడంతో రెండేళ్ల సస్పెన్షన్..
ఈ ఏడాది నుంచి బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకుని, ఏదైనా ఫ్రాంచైజీ పిక్ చేశాక, మధ్యలో తప్పుకుంటే ఆ ప్లేయర్ పై రెండేళ్ల నిషేధం విధిస్తోంది.

IPL 2025 Live Updates: ఐపీఎల్ కు డుమ్మా కొట్టిన విదేశీ క్రికెటర్ పై ఐపీఎల్ యాజమాన్యం కొరడా ఝళిపించింది. ఇంగ్లాండ్ కు చెందిన హ్యారీ బ్రూక్.. ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమవతున్నట్లు ప్రకటించాడు. తన సొంత జట్టుకు అందుబాటులో ఉండటంతోపాటు రాబోయే భారత్ సిరీస్, యాషెస్ సిరీస్ లకు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ ఏడాది నుంచి బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకుని, ఏదైనా ఫ్రాంచైజీ పిక్ చేశాక, మధ్యలో తప్పుకుంటే ఆ ప్లేయర్ పై రెండేళ్ల నిషేధం విధించనున్నట్లు వేలానికి ముందుగానే ఆటగాళ్లకు తెలియ పరిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ నిబంధనను ఉల్లంఘించడంతో బ్రూక్ పై బీసీసీఐ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తెలిపింది. మరో రెండేళ్లపాటు ఐపీఎల్ వేలంలో బ్రూక్ పాల్గొనే అవకాశం లేదు.
HARRY BROOK BANNED 🚨
— Ganesh 🇮🇳 (@GaneshVerse) March 13, 2025
BCCI has banned Harry Brook for 2 years in IPL after he pulled out at the last moment.
[Devendra Pandey - Express Sports]#HarryBrook #IPL #CricketNews pic.twitter.com/7s1YSCF5QA
గతేడాది కూడా ఇంతే..
బ్రూక్ టోర్నీ మధ్యలోనే ఇలా వైదొలగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది తన గ్రాండ్ మదర్ చనిపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు కూడా అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈసారి మాత్రం తన సొంత జట్టు ప్రయోజనాల కోసం ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరించాడు. ఈ ఏడాది జాతీయ జట్టు తరఫున ఫుల్ బిజీగా ఆడబోతున్నానని, ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. నిజానికి బ్రూక్ లాగానే చాలామంది ఆటగాళ్లు ఇలా మధ్యలోనే వైదొలుగుతున్నారు. దీంతోవారికి ముకుతాడు వేసేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బ్రూక్ ఈ నిర్ణయానికి గురైన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
సన్ రైజర్స్ తో అరంగేట్రం..
2023లో సన్ రైజర్స్ హైదరాబాద్.. బ్రూక్ ను వేలంలో కొనుగోలు చేసింది. రూ.13.25 కోట్ల పెట్టుబడి పెట్టినా, తను అంతగా రాణించలేదు. 11 మ్యాచ్ ల్లో కేవలం 190 పరుగులే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఆ సీజన్ లో తను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆ తర్వాత ఏడాది బ్రూక్ ను సన్ రిలీజ్ చేయగా, ఢిల్లీ పిక్ చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో టోర్నీ ప్రారంభానికి సరిగ్గా పది రోజుల ముందు తప్పుకున్నాడు. ఈ సారి కూడా అలాగే బ్రూక్ చేయడంతో బీసీసీఐ అతనిపై కన్నెర్ర చేసింది. ఇక బ్రూక్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమ్ కు ముందు బీజీ షెడ్యూల్ ఉందని తెలిసినప్పటికీ, వేలంలో ఎందుకు పాల్గొన్నాడని విమర్శిస్తున్నారు. ప్రొఫెషనల్ ప్లేయర్ లా బ్రూక్ వ్యవహరించడంలేదని పేర్కొంటున్నారు. ఇక ఈనెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది.




















