DC Vs SRH: డేవిడ్ భాయ్ దెబ్బ అదుర్స్ - సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడిన వార్నర్ - 21 పరుగులతో ఢిల్లీ విక్టరీ!
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గెలిచిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగులతో విజయం సాధించింది.
డేవిడ్ వార్నర్ రివెంజ్ తీర్చుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో తనను అవమానకరంగా ట్రీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్ అందించి మ్యాచ్ గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (92 నాటౌట్: 58 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... రొవ్‌మన్ పావెల్ (67 నాటౌట్: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగులతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అదరగొట్టిన వార్నర్ భాయ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (0: 5 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత మిషెల్ మార్ష్ (10: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రిషబ్ పంత్ (26: 11 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆడినంత సేపు చెలరేగి ఆడినా ఎప్పటిలానే నిర్లక్ష్యమైన ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌కు రొవ్‌మన్ పావెల్ జత కలిశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడారు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ముఖ్యంగా చివర్లో డేవిడ్ వార్నర్ తీసుకున్న నిర్ణయం తన కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది. 19 ఓవర్లు ముగిసేసరికి వార్నర్ 92 పరుగుల మీద ఉన్నాడు. అయినా సింగిల్ తీయవద్దని, వీలైనంత వేగంగా ఆడమని రొవ్‌మన్ పావెల్‌కు వార్నర్ సూచించాడు.
దీంతో చివరి ఓవర్లో రొవ్‌మన్ పావెల్ ఒక సిక్సర్, మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులు రాబట్టాడు. ఉమ్రాన్ మలిక్ 157, 155 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతులను రొవ్‌మన్ పావెల్ బౌండరీలకు తరలించడం విశేషం. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
పూరన్ పోరాడినా...
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్), కేన్ విలియమ్సన్ (4: 11 బంతుల్లో, ఒక ఫోర్) ఘోరంగా విఫలం అయ్యారు. రాహుల్ త్రిపాఠి (22: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఈ దశలో ఎయిడెన్ మార్క్రమ్ (42: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), నికోలస్ పూరన్ (62: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు) రైజర్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే తర్వాత వచ్చిన వారిలో ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితం అయింది. 21 పరుగులతో ఓటమి చవి చూసింది.