IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
ఐపీఎల్ ఇకపై 'వివో ఐపీఎల్' కాదు! వచ్చే సీజన్ నుంచి 'టాటా ఐపీఎల్'గా మారబోతోందని సమాచారం! ఈ మేరకు ఒప్పందాలు చకచకా జరగుతున్నాయని తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగు ప్రధాన స్పాన్సర్ మారుతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 'వివో' లీగుతో బంధం తెంచుకోనుందని సమాచారం. దాని స్థానంలో భారతీయ కంపెనీ 'టాటా గ్రూప్' రానుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పీటీఐకి తెలిపారు.
మంగళవారం జరిగిన సమావేశంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లను మార్చాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ విషయం గురించి ప్రశ్నించగా 'అవును, ఐపీఎల్ టైటిల్ ప్రధాన స్పాన్సర్‌గా టాటా గ్రూప్ రానుంది' అని పాలక మండలి ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పీటీఐకి తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇందుకోసం చాలా కంపెనీలు పోటీపడుతుంటాయి. 2018-2022 కాలానికి ఈ హక్కులను చైనీస్ మొబైల్ కంపెనీ వివో దక్కించుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున రూ.2200 కోట్లకు హక్కులను కైవసం చేసుకుంది. అయితే 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ తర్వాత పరిణామాలు మారిపోయాయి.
Also Read: ప్రపంచకప్ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!
Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!
డ్రాగన్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం వేటు వేయడం ఆరంభించింది. టిక్‌టాక్, హెలో సహా కొన్ని యాప్‌లను నిషేధించింది. ఇదే సమయంలో చైనా కంపెనీ వివో ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా ఉండొద్దని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరిగాయి. దాంతో స్వతహాగా ఆ ఏడాది ఐపీఎల్ నుంచి వివో దూరమైంది. రూ.222 కోట్లతో డ్రీమ్ ఎలెవన్ ఆ ఏడాది స్పాన్సర్‌షిప్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత సీజన్ నుంచి మళ్లీ యథావిధిగా వివోనే కొనసాగింది.
ఏం జరిగిందో తెలియదు గానీ హఠాత్తుగా పరిణామాలు మారిపోయాయి. టాటా గ్రూప్ ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తారని బ్రిజేశ్ పటేల్ మీడియాకు చెప్పారు. ఇక మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అహ్మదాబాద్, లఖ్‌నవూ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకోగానే మిగతా వ్యవహారాలు మొదలవుతాయి.