IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?
ఐపీఎల్ 2022 సీజన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అయితే ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కానుందని బీసీసీఐ తన స్టేక్ హోల్డర్లకు ఇప్పటికే తెలిపారని వార్తలు వస్తున్నాయి.
ఎనిమిది జట్లతో ఐపీఎల్ జరిగినప్పుడు 60 మ్యాచ్‌లు జరగ్గా, ఇప్పుడు 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీన్ని బట్టి జూన్ 4, 5వ తేదీల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటిలో ఏడు మ్యాచ్‌లు సొంత మైదానంలోనూ, మిగతా ఏడు మ్యాచ్‌లు ప్రత్యర్థి మైదానాల్లోనూ జరగనున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతుంది కాబట్టి మొదటి మ్యాచ్ చెపాక్ స్టేడియంలోనే జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉండనుందని తెలుస్తోంది.
ఈసారి ఐపీఎల్ పూర్తిగా మనదేశంలోనే జరగనుందని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలు ఇటీవలే చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా జై షా మాట్లాడుతూ ‘చెన్నై సూపర్ కింగ్స్‌ను చెపాక్ ఆడాలని అందరూ కోరుకుంటున్న విషయం నాకు తెలుసు. ఆరోజు ఎంతో దూరంలో లేదు. ఈసారి మరో రెండు జట్లు కూడా పోటీలోకి రానున్నాయి కాబట్టి ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. మెగా ఆక్షన్ కూడా వస్తుంది. ఈసారి కొత్త కాంబినేషన్లు కూడా చూడవచ్చు.’ అని బీసీసీఐ సెక్రటరీ ఈ సందర్భంగా అన్నారు. ఐపీఎల్ 2020 పూర్తి సీజన్, 2021లో సగం సీజన్ యూఏఈలో జరిగాయి.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న భారత జట్టు తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 8వ తేదీన టీమిండియా.. దక్షిణాఫ్రికాకి ప్రయాణం కానుంది. న్యూజిలాండ్‌తో డిసెంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భారత్ సిరీస్ ఆడనుంది. అంటే ఈ మ్యాచ్ ముగియగానే వెంటనే ఫ్లైట్ ఎక్కేయనున్నారన్న మాట. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read: Gambhir on Ravi Shastri: శాస్త్రిపై గౌతీ విమర్శలు.. ద్రవిడ్ సమతూకం బాగుందన్న మాజీ ఓపెనర్
Also Read: Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!