IPL 2021, Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌లో రాజసమెంత? టైటిల్ గెలవాలంటే ఏం చేయాలి?
వరుసగా నాలుగేళ్లు తిరుగులేని విజయాలే నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత చతికిలపడింది. రెండేళ్లుగా ఆ ఫ్రాంచైజీ కొత్త వ్యూహాలు, కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్లో ఆ జట్టు ఇప్పుడెలా ఉంది?
రాజస్థాన్ రాయల్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర విజేత. తొలి ఏడాదే దుమ్మురేపింది. వరుసగా నాలుగేళ్లు తిరుగులేని విజయాలే నమోదు చేసింది. ఆ తర్వాత చతికిలపడింది. రెండేళ్లుగా ఆ ఫ్రాంచైజీ కొత్త వ్యూహాలు, కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. 2021 ఆరంభంలోనూ స్టార్ క్రికెటర్లతో పటిష్ఠంగా కనిపించిన ఆ జట్టు ఇప్పుడెలా ఉంది? సీజన్ గెలవాలంటే ఏం చేయాలి?
అప్పుడు బలంగా..
ఐపీఎల్ మొదటి దశలో రాజస్థాన్ రాయల్స్ అత్యంత బలమైన జట్టుగా కనిపించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, యువ పేసర్ జోఫ్రా ఆర్చర్, బిగ్ హిట్టర్ జోస్ బట్లర్ ఉండేవారు. భారత ఆటగాళ్ల బృందమూ బాగానే ఉండేది. మెరుపులు మెరిపించే కుర్రాళ్లూ ఉన్నారు. కానీ ఐపీఎల్ రెండోదశలో ఆంగ్లేయ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఇది కచ్చితంగా ఆ జట్టుపై ప్రభావం చూపించేదే.
Also Read: దాదా, మహీలో బెస్ట్ కెప్టెన్ ఎవరంటే..! సెహ్వాగ్ ఇచ్చిన జవాబేంటో తెలుసా?
ఐదో స్థానంలో..
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సీజన్ వాయిదా పడ్డప్పటితో పోలిస్తే ఇప్పుడా జట్టు బలహీనంగా మారిందనే చెప్పాలి. ఐపీఎల్ తొలి దశలో ఆ జట్టు ఏడు మ్యాచులు ఆడగా నాలుగు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓడిపోయింది. దాంతో ఆరు పాయింట్లతో పట్టికలో నిలిచింది. ఇక రెండో దశలో ఆ జట్టు వరుసగా పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
రాణించింది వీరే
ఇప్పటి వరకు రాయల్స్‌లో ఎక్కువ పరుగులు చేసింది కెప్టెన్ సంజు శాంసన్ మాత్రమే. ఏడు మ్యాచుల్లో 46.16 సగటు, 145.78 స్ట్రైక్‌రేట్‌తో 277 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం (119) ఉంది. బౌలింగ్‌లో క్రిస్ మోరిస్ విజృంభించాడు. 7 మ్యాచుల్లో 16 సగటు, 8.61 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. 4/23 అత్యుత్తమం. తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లలో నిలకడ కనిపించడం లేదు.
కొత్తవాళ్లూ చేరారు
ప్రస్తుతం రాయల్స్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. భుజం గాయంతో ఆర్చర్ పూర్తిగా సీజన్‌కు దూరమయ్యాడు. మానసిక ఆరోగ్య కారణాలతో బెన్‌స్టోక్స్ క్రికెట్‌కు తాత్కాలికంగా విరామం పలికాడు. వ్యక్తిగత కారణాలతో జోస్ బట్లర్, ఆండ్రూ టై దూరమయయారు. వీరి స్థానాలను భర్తీ చేసుకొనేందుకు రాజస్థాన్ కష్టపడాల్సి వచ్చింది. ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్ తబ్రైజ్ షంశీని తీసుకున్నారు. అతడితో పాటు ఎవిన్ లూయిస్, గ్లెన్ ఫిలిప్స్, ఓషాన్ థామస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారెలా రాణిస్తారన్నది ఆసక్తికరం.
నాలుగు గెలిస్తేనే
రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కత్తిమీద సామే! అదేమీ అంత సులభం కాదు. సీజన్ ఆరంభంలో తొలి నాలుగు మ్యాచుల్లో ఓడారు. కోల్‌కతాపై 7 వికెట్ల విజయంతో గాడిన పడ్డారు. తర్వాతి మ్యాచులో ముంబయి ఓడించినా హైదరాబాద్‌పై 55 పరుగుల తేడాతో గెలిచి రేసులో నిలిచారు. అయితే అప్పట్లా రెండో దశలో ఒడుదొడుకులు ఎదుర్కొంటే కష్టం! ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాలి. రెండో దశలో మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం నాలుగు గెలిస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరుకొనే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని జట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్నా.. అంత వరకు తెచ్చుకోకపోవడమే మంచిది.
Also Read: IPL 2021: యూఏఈలో ముంబయి ఇండియన్స్ ఎందుకు గెలవగలదంటే..? గౌతీ వివరణ ఇదీ