INDW Vs PAKW 1st Innings Highlights: అదరగొట్టిన భారత బౌలర్లు - పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా టార్గెట్ ఎంత?
INDW Vs PAKW: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులకే పరిమితం చేశారు.
INDW Vs PAKW Innings Highlights: 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు విజృంభించారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టును 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులకే పరిమితం చేశారు. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. భారత్ విజయానికి 120 బంతుల్లో 106 పరుగులు అవసరం. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా, శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు దక్కించుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభనలకు తలో వికెట్ దక్కింది.
బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారి ఇన్నింగ్స్ అనుకున్న విధంగా సాగలేదు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ గుల్ ఫెరోజాను (0: 4 బంతుల్లో) డకౌట్ చేసి రేణుకా సింగ్ టీమిండియాకు తొలి వికెట్ అందించింది. అనంతరం పాకిస్తాన్ ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టతరంగా ఉండటం కూడా దీనికి ఒక కారణం. బంతి బ్యాట్ మీదకు రాకుండా బ్యాటర్లను చాలా ఇబ్బందులు పెట్టింది.
భారత బౌలర్లు కూడా పిచ్ నుంచి లభించిన సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. పాకిస్తాన్ బ్యాటర్లను అస్సలు క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఐదో ఓవర్లో సిద్రా అమీన్‌ను (8: 11 బంతుల్లో, ఒక ఫోర్) దీప్తి శర్మ (3: 6 బంతుల్లో) బౌల్డ్ చేశారు. రెండు ఓవర్లలో వ్యవధిలోనే ఒమైమా సొహైల్‌ను అరుంధతి పెవిలియన్ బాట పట్టించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో నిదా దార్ (28: 34 బంతుల్లో, ఒక ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచారు. చివర్లో కెప్టెన్ ఫాతిమా సనా (13: 8 బంతుల్లో, రెండు ఫోర్లు), నష్రా సంధు (6 నాటౌట్: 2 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.
భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ వికెట్లు తీయడంతో పాటు పరుగులను కూడా బాగా కట్టడి చేశారు. అరుంధతి రెడ్డి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకుని 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇక శ్రేయాంక పాటిల్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకుని కేవలం 12 పరుగులే ఇచ్చారు. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది.
భారత మహిళల తుది జట్టు
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్
పాకిస్థాన్ మహిళల తుది జట్టు
మునీబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా (కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్
Innings Break!
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
A fabulous bowling display from #TeamIndia 🙌
🎯 - 1⃣0⃣6⃣
Over to our batters 💪
📸: ICC
Scorecard ▶️ https://t.co/eqdkvWVK4h#T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/fCrNt9ID8n