Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
India Wins Thomas Cup 2022: థామస్ కప్‌ని తొలిసారి నెగ్గడంతో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు.
Satwik SaiRaj Rankireddy: కోనసీమ జిల్లా.. భారత బాడ్మింటన్ టీమ్ తొలిసారి థామస్ కప్ విజేతగా అవతరించింది. ప్రతిష్టాత్మక టోర్నీని 7 దశాబ్దాల తరువాత నెగ్గడంతో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ టీమ్ 14 సార్లు ఛాంపియన్ ఇండోనేషియాపై 3-0 తో గెలుపొంది తొలిసారి థామస్ కప్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు థామస్ కప్ నెగ్గంతో ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో సంబరాలు మిన్నంటాయి.
తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత జట్టులో కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన డబుల్స్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఉండడంతో అమలాపురం పట్టణంలో క్రీడాభిమానులు, స్థానికులు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ పట్టణానికి చెందిన ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకంతో క్రీడాభిమానులు అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్దకు చేరుకుని జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.
కేక్ కట్ చేసి సంబరాలు..
కోనసీమ జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్‌కు, అతని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సాత్విక్, శ్రీకాంత్ మనోళ్లే..
థామస్ కప్ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లలో సాత్విక్, కిడాంబి శ్రీకాంత్ తెలుగు వాళ్లు. ఇండోనేషియాకు చెందిన అసాన్, సంజయ ద్వయంపై సాత్విక్, చిరాగ్ శెట్టి 18-21, 23-21, 21-19 తో విజయం సాధించారు. 21 సంవత్సరాల సాత్విక్ 2018లో కామన్వెల్త్ స్వర్ణం సాధించడంతో వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ ఏడో ర్యాంక్‌లోనూ, మిక్స్‌డ్ డబుల్స్‌లో 26వ స్థానంలోనూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం తన స్వస్థలం. 2018లో కామన్వెల్త్ స్వర్ణం సాధించినప్పుడు సాత్విక్ భాగస్వామి చిరాగ్ శెట్టినే.
2018లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుకు కూడా చేరిన శ్రీకాంత్ ప్రస్తుతం 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. కిడాంబి శ్రీకాంక్ తెలుగు ఆటగాడు. ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెంలో 1993లో తను జన్మించాడు.
Also Read: Thomas Cup, Players List: థామస్ కప్‌లో తెలుగు తేజాల హవా - ఐదుగురిలో ఇద్దరు తెలుగు వారే!