India vs Belgium, Hockey Semi-Final: పురుషుల హాకీలో తడబడిన భారత్.. పసిడి ఆశలు గల్లంతు... కాంస్యం కోసం ఆగస్టు 5న ఆఖరి పోరు
బంగారు పతకం గెలుస్తుందనుకున్న భారత హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్ అయిన స్ట్రాంగ్ టీమ్ బెల్జియం చేతిలో భారత్ ఓడిపోయింది.
టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్‌లో ఓడింది. డిపెండింగ్ ఛాంపియన్ బెల్జియం చేతిలో భారత్ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్‌పై విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెమీస్‌లో ఓడిన భారత్... మరో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో కాంస్యం కోసం పోరాడుతోంది.
మ్యాచ్ ఎలా సాగింది
మ్యాచ్ ప్రారంభించిన రెండో నిమిషంలోనే బెల్జియం ఆటగాడు లుయిపెర్ట్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చాడు. ఆ తర్వాత 7వ నిమిషంలో హర్మన్ ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. రెండు నిమిషాలకే మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. బెల్జియంకు ఎక్కువ పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇవ్వడంతోనే మ్యాచ్ ఓడిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ చూసిన వాళ్లందరి నోట ఇదే మాట.
మ్యాచ్ మొత్తంలో బెల్జియంకు 14సార్లు పెనాల్టీ కార్నర్‌లు కొట్టే అవకాశాలు దక్కాయంటే చూడండి. 19వ నిమిషంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు ఆడింది బెల్జియం. ప్రత్యర్థి ఆటగాడు హెండ్రిక్స్ మూడో ప్రయత్నంలో గోల్ చేయడంతో మరోసారి భారత్ ఆధిక్యం కోల్పోయింది. 2-2తో స్కోరు సమమైంది. గోల్స్ సాధించేందుకు రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు దూకుడు ప్రదర్శించాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. బెల్జియం ఆటగాళ్లు... భారత్‌ను మరో గోల్ చేయకుండా చుట్టుముట్టి అడ్డుకున్నారు.
భారత్‌కు 5సార్లు పెనాల్టీ కార్నర్‌లు ఆడే అవకాశం దక్కింది. కానీ, ఒక్కసారి మాత్రమే విజయవంతమైంది. దీంతో భారత్ అనుకున్న స్కోరు చేయలేకపోయింది. నాలుగో క్వార్టర్‌ను 2-2తో ప్రారంభించిన రెండు జట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో అనవసర తప్పిదాలు చేయడం... పెనాల్టీ కార్నర్‌లు ఇలా సాగింది. మరోసారి పెనాల్టీ కార్నర్స్ కారణంగానే బెల్జియం రెండు గోల్స్ సాధించింది. దీంతో 4-2తో దూసెకెళ్లిందది. డిఫెన్స్‌తో బెల్జియం... భారత్‌ను బోల్తా కొట్టించింది. ఆట ముగిసే ఆఖరి సమయంలో బెల్జియం ఆటగాడు దొహెమన్ మరో గోల్ చేసి 5-2ఆధిక్యాన్ని మరింత పెంచాడు.
కాంస్య పతకం కోసం ఆగస్టు 5న ఇండియా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా X జర్మనీ మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టుతో భారత్ పోటీపడుతుంది. ఈ కాంస్య పోరులోనైనా భారత్ గెలవాలని మనసారా ఆశిద్దాం. ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలతో సహా 11 పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఈ జాబితాలో మరో పతకం చేర్చాలని మన్‌ప్రీత్ బృందం ఉవ్విళ్లూరుతోంది. చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించింది.
గెలుపోటములు జీవితంలో భాగం
భారత్Xబెల్జియం మధ్య సెమీఫైనల్ మ్యాచ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా స్పందించారు. గెలుపోటములు జీవితంలో భాగమని అన్నారు.
Wins and losses are a part of life. Our Men’s Hockey Team at #Tokyo2020 gave their best and that is what counts. Wishing the Team the very best for the next match and their future endeavours. India is proud of our players.
— Narendra Modi (@narendramodi) August 3, 2021