IND vs WI, Full Match Highlight: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ కూడా!
IND vs WI, 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా వెస్టిండీస్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (80; 111 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (56; 54 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. దీంతో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
భారత పేసర్ల హవా..
266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలం అయింది. ఒడియన్ స్మిత్, నికోలస్ పూరన్ తప్ప ఎవరూ 20 పరుగులను కూడా దాటలేదు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి వెస్టిండీస్‌ను భారత బౌలర్లు అస్సలు కుదురుకోనివ్వలేదు. ఐదు ఓవర్లలోపే విండీస్ మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డారెన్ బ్రేవో, నికోలస్ పూరన్ కలిసి ఇన్నింగ్స్‌ను కొంచెం కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఈ దశలో డారెన్ బ్రేవో అవుట్ కావడంతో వెస్టిండీస్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కేవలం 15 పరుగుల తేడాలోనే మరో నాలుగు వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్ కాసేపు వేగంగా ఆడాడు. 18 బంతుల్లోనే 36 పరుగులు చేసిన స్మిత్ ఎనిమిదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.
ఒడియన్ స్మిత్ అవుటయ్యాక టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ కాసేపు భారత బౌలర్లను నిలువరించారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. చివర్లో వీరు కూడా వరుస ఓవర్లలో అవుట్ కావడంతో వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసీధ్ కృష్ణ మూడేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
రాణించిన పంత్, అయ్యర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మొదట్లోనే అడ్డంకులు ఎదురయ్యాయి. జట్టు స్కోరు 16 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (13), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) ఒకే ఓవర్లో ఔటయ్యారు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో శిఖర్ ధావన్ (10) సైతం ఔటవ్వడంతో టీమిండియా 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత టీమిండియాను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. ఈ క్రమంలో మొదట శ్రేయస్, తర్వాత రిషబ్ పంత్ అర్ధశతకం అందుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 124 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ దశలోనే పంత్ అవుటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ (6) నిరాశపరిచినా... దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ వేగంగా ఆడారు. ఒకవైపు పరుగులు వేగంగా వచ్చినా.. వికెట్లు కూడా ఎక్కువగానే పడటంతో భారత్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ రెండేసి వికెట్లు, ఒడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్ చెరో వికెట్ తీశారు.