Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!
IND vs SA, 2nd ODI, Boland Park: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అందరూ రాణించారు. జానేమన్ మలన్ (91: 108 బంతుల్లో, 8 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో సొంతం చేసుకుంది.
288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు ఎక్కడా అవాంతరం ఎదురు కాలేదు. ఓపెనర్లు జానేమన్ మలన్, క్వింటన్ డికాక్ (78: 66 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇద్దరూ చెలరేగి ఆడారు. మొదటి వికెట్‌కు 22 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు. ఈ దశలో డికాక్ అవుట్ అయినా.. టెంబా బవుమా (35: 36 బంతుల్లో, మూడు ఫోర్లు), మలన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటయినా.. ఎయిడెన్ మార్క్రమ్ (37 నాటౌట్: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు), వాన్ డర్ డసెన్ (37 నాటౌట్: 38 బంతుల్లో, రెండు ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. భారత బౌలర్లు ఏదశలోనూ దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టలేకపోయారు.
భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి 11 ఓవర్ల పాటు ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. కేఎల్ రాహుల్‌తో (55: 79 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మొదటి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం శిఖర్ ధావన్ (29: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు) మార్క్రమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో) కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడంతో భారత్ 64 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో రాహుల్‌కు రిషబ్ పంత్ జతకలిశాడు. రాహుల్ ఒక ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేయగా.. రిషబ్ పంత్ మాత్రం చెలరేగి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 111 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుటపడింది అనుకున్న సమయంలో మళ్లీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (11: 14 బంతుల్లో) విఫలం కాగా.. వెంకటేష్ అయ్యర్ (22: 33 బంతుల్లో, ఒక సిక్సర్) కాసేపు క్రీజులో నిలబడే ప్రయత్నం చేశాడు. అయితే ఫెలుక్వాయో వైడ్ బాల్‌తో వెంకటేష్ అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. వైడ్ బాల్‌కు వెంకటేష్ అయ్యర్ స్టంప్డ్ అవుట్ అయి వెనుదిరిగాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (40: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), అశ్విన్ (25: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఆదుకోవడంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది.
That's that from the 2nd ODI.
— BCCI (@BCCI) January 21, 2022
South Africa win by 7 wickets and take an unassailable lead of 2-0 in the three match series.
Scorecard - https://t.co/CYEfu9Eyz1 #SAvIND pic.twitter.com/TBp87ofgKm