IND vs AUS: 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతున్న టీమిండియా - ఆస్ట్రేలియాకు పెద్ద స్కెచ్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతోంది.
India vs Australia 1st Test Match Nagpur: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. దీంతో పాటు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అతని శిబిరంలో మొత్తం 10 మంది స్పిన్నర్లు ఉన్నారు. వారు ఆటగాళ్లకు స్పిన్ ఆడటంలో ప్రాక్టీస్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాపై రోహిత్ టీమ్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే భారత్ జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ బౌలర్‌గా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు జట్టులో చోటు దక్కింది. ఈ విధంగా చూస్తే టీమ్ ఇండియాలో మొత్తం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం భారత శిబిరంలో 10 మంది స్పిన్నర్లు ఉన్నారు. వీరంతా బ్యాట్స్‌మెన్‌లను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేలా చేయడంతో పాటు తమకు కూడా అండగా నిలుస్తున్నారు.
టీమ్ ఇండియా క్యాంపులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, జయంత్ యాదవ్, పుల్కిత్ నారంగ్, సాయి కిషోర్, రాహుల్ చాహర్ ఉన్నారు. ఈ బౌలర్లంతా బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టిస్తున్నారు. భారత జట్టు ఇప్పటికే నెట్స్ బౌలర్లుగా సాయి కిషోర్, రాహుల్, సౌరభ్, సుందర్‌లను ఎంపిక చేసింది. దీని తర్వాత జయంత్, నారంగ్ కూడా ఉన్నారు.
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర గురించి చెప్పాలంటే ఇందులో టీమిండియాదే పైచేయి. ఈ సిరీస్‌ను తొలిసారిగా 1996-97లో ఆడారు. దీంతో భారత్ 1-0తో విజయం సాధించింది. ఆ తర్వాత టీమ్ ఇండియా రెండోసారి కూడా విజయం సాధించింది. ఈ సిరీస్ చివరిసారిగా 2020-21లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. దీన్ని కూడా టీమ్ ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది. ఈసారి కూడా భారత శిబిరం ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం ఉంది.
2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత జట్టు వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.