Hockey World Cup 2023: కల చెదిరింది - హాకీ వరల్డ్ కప్‌లో భారత్ ఇంటిబాట - క్వార్టర్స్‌కు కూడా చేరలేక!
క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా హాకీ వరల్డ్ కప్ నుంచి ఇంటి బాట పట్టింది.
హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచింది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్ 5-4తో ముందంజ వేసింది. దీంతో భారత్ ఇంటి బాట పట్టింది.
భారత్ తరఫున వరుణ్ కుమార్ (మూడో నిమిషం), లలిత్ కుమార్ (17వ నిమిషం), సుఖ్‌జీత్ సింగ్ (24వ నిమిషం) గోల్స్ సాధించారు. దీంతో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. అయితే తర్వాత న్యూజిలాండ్ వెంటనే కోలుకుంది. శామ్ లేన్ (28వ నిమిషం), కేన్ రసెల్ (43వ నిమిషం), షాన్ ఫిండ్లే (49వ నిమిషం) గోల్స్ సాధించి స్కోరును సమం చేశారు.
పూల్-డిలో ఇంగ్లండ్ టాపర్‌గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ వారి గోల్ డిఫరెన్స్ మెరుగ్గా ఉంది. దీంతో ఇది భారత్‌కు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌గా మారింది. పూల్-సిలో మూడో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్, భారత్‌పై విజయం సాధించి టోర్నీలో ముందుకు దూసుకెళ్లింది.
ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 12వ స్థానంలో ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. ఇది క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్. జనవరి 24వ తేదీన (మంగళ వారం) ఈ మ్యాచ్ జరగనుంది. మరో వైపు భారత్ మాత్రం కనీసం క్వార్టర్స్‌కు కూడా చేరలేక ఇంటి బాట పట్టింది. 48 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ నెగ్గాలనే భారత్ కల కూడా చెదిరింది.
ఈ టోర్నీ నుంచి టీమిండియా మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బ అయింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అటాకింగ్ ప్లేయర్‌కు గాయం అయింది. దీంతో అతను ఏకంగా టోర్నీకే దూరం అయ్యాడు. మొదట కేవలం వేల్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండబోడని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నుంచే దూరం కావాల్సి రావడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది.
టీమిండియా హాకీ టీమ్ లో అటాకింగ్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ కీలక ఆటగాడు. తన అటాకింగ్ గేమ్ తో జట్టుకు చాలాసార్లు ఉపయోగపడేలా ఆడాడు. ఈ మెగా టోర్నీలో స్పెయిన్ పై విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా గా ముగియడంలోనూ హార్దిక్ ది ప్రధాన పాత్ర.
హార్దిక్ కండరాలు పట్టేశాయి. అతనిని వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వడంతో జట్టు మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన తర్వాత అతను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
భారత్ చివరిసారిగా 1975లో హాకీ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఈసారి జట్టు పటిష్టంగా ఉండటంతో విజేతగా నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ క్వార్టర్స్‌కు కూడా చేరలేకపోయారు. 1971 వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా, 1973 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 1975 విజయం తర్వాత ఒక్కసారిగా కూడా కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయింది.
View this post on Instagram