T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అమెరికాలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందా! ఐసీసీ నిర్ణయానికి అర్థమిదే
T20 Cricket World Cup in the USA: అమెరికాలో క్రికెట్ ఆడేవాళ్లు, చూసేవాళ్లు చాలా తక్కువ. అయినా సరే క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని అమెరికాలో టీ20 వరల్డ్ కప్ ఎందుకు జరుగుతోందో తెలుసా?
![T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అమెరికాలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందా! ఐసీసీ నిర్ణయానికి అర్థమిదే Why is the T20 Cricket World Cup 2024 in the USA T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అమెరికాలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందా! ఐసీసీ నిర్ణయానికి అర్థమిదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/31/b3edfa1e8a0e95ac7b44fa86263047ec17171326688691036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Why is the T20 Cricket World Cup in the USA: అమెరికా(USA)లో ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, బేస్‌బాల్ వంటి క్రీడలు మాత్రమే పాపులర్. వాటిల్లో ఎంత వెతికి చూసినా క్రికెట్(Cricket) కనబడదు. అయినాసరే టీ20 క్రికెట్ ప్రపంచకప్(T20 World Cup) కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెస్టిండీస్(West Indies)తో పాటు అమెరికాను కూడా ఆతిథ్యం దేశంగా ఎంపిక చేసింది. నిజానికి క్రికెట్ అంటే పడి చచ్చిపోయే అనేక దేశాలు వరల్డ్‌కప్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి. అయినా సరే అగ్రరాజ్యానికి ఐసీసీ పెద్దపీట వేసింది. ఎందుకంటే ..
ముఖ్యం కారణం ఇదేనా..
టీ20 వరల్డ్‌కప్‌లో 55 మ్యాచ్‌లకు 16 అమెరికాలోనే జరగనున్నాయి. క్రికెట్ వంటి కమర్షియల్ గేమ్ కోసం కొత్త దేశాలను ఐసీసీ ఎప్పటి నుంచో వెతుకుతోంది. తద్వారా ఆడే జట్లకు, ఐసీసీకి భారీగా ఆదాయం సమకురుతుందని. అలా వెతుకుతున్న సమయంలోనే సంపదకు లోటు లేని అమెరికాపై ఐసీసీ దృష్టి పడింది. క్రికెట్‌ను ప్రపంచమంతా విస్తరించడానికి అమెరికా వ్యూహాత్మకమైన మార్కెట్ అని క్రికెట్ యూఎస్‌ఏ ఛైర్మన్ పరాగ్ మరాతే( Paraag Marathe) ఐసీసీకి బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. తద్వారా అమెరికాలోనూ క్రికెట్ బలపడుతుందని ఆయన నమ్మకంతో ఉన్నారు.
ఐపీఎల్ తరహాలో మేజర్ క్రికెట్ లీగ్ -ఎమ్‌ఎల్‌సీ( Major League Cricket (MLC)) పేరుతో నిర్వహిస్తున్న టోర్నీకి ఇటీవల అమెరికాలో కొంత ఆదరణ లభిస్తోంది. భారతీయ మూలాలు ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ ఎమ్‌ఎల్‌సీలో పెట్టుబడిదారులకుగా ఉన్నారు. ఇంగ్లీష్ ఆటగాడు జేసన్ రాయ్, విండీస్ దిగ్గజం సునీల్ నరైన్, న్యూజిలాండ్ క్రికెటర్ ట్రెంట్ బౌల్డ్, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ వంటి ఆటగాళ్లను ఎమ్‌ఎల్‌సీ ఆకట్టుకుంది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత ప్రారంభంకానున్న కొత్త ఎమ్‌ఎల్‌సీ సీజన్‌పై ప్రపంచకప్ ప్రభావం పాజిటివ్‌గా ఉంటుందని క్రికెట్ యూఎస్‌ఏ ఆశిస్తోంది.
గతమెంతో ఘనం..
ప్రస్తుతానికి క్రికెట్‌కు అమెరికాలో అంత ఆదరణ లేకపోయినా అగ్రరాజ్యానికి క్రికెట్ చరిత్ర బాగానే ఉంది. పొరుగునే ఉన్న కెనడాతో 1844లో అమెరికా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది. 1882లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతోనూ అమెరికా జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడింది. బ్రిటిష్ పాలకుల ద్వారా క్రికెట్ అమెరికాకు పాకింది. 1861 నుంచి 1865 మధ్య జరిగిన అమెరికా సివిల్ వార్ సమయంలో అమెరికా బ్యాట్, బాల్ గేమ్‌గా బేస్ బాల్ మారిపోయింది. తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం, క్రికెట్ పై ఆసక్తి సన్నగిల్లడం, క్రికెట్ యూఎస్‌ఏలో పాలనా వ్యవహారాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పడిపోయింది. అయితే ఇటీవల ప్రీటోర్నమెంట్ వార్మప్ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో అమెరికా జట్టు ఓడించడంతో ఆ టీమ్‌లో ఉత్సాహం ఇనుమడించింది.
ఫాన్స్ ఎక్కువే కానీ..
అమెరికాలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారా అంటే చాలా మందే ఉన్నారు. మెక్సికో తర్వాత అమెరికా వలస వెళ్లే వారు భారతీయులే. బ్రిటిషర్లు, కరేబియన్ మూలాలు ఉన్న వారు కూడా అమెరికాలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల సర్వేలో పది శాతం అమెరికన్లకు మాత్రమే ఎమ్‌ఎల్‌సీ టోర్నీ గురించి తెలుసని తేలింది. అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరుగుతోందని కేవలం ఆరు శాతం మంది అమెరికన్లకు మాత్రమే తెలుసు. ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే పొట్టి ప్రపంచకప్‌పై ఆసక్తి చూపుతున్నారు. క్రికెట్ ప్రపంచకప్‌పై ఆసక్తి చూపే వారిలో 62శాతం మంది వలస వచ్చిన మూలాలు ఉన్నవారే. అదే అమెరికా టీమ్‌లోనూ కనిపిస్తోంది. ఆఖరుకు క్రికెట్ యూఎస్‌ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్(Monank Patel) భారత్‌లో పుట్టినవాడే. టీ20 ప్రపంచకప్ ద్వారా నేటివ్ అమెరికన్లు క్రికెట్ అభిమానులుగా మారతారనే అంచనాలు ఎంతవరకూ నెరవేరతాయో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)