Shreyas Iyer: ఆ బాధ వర్ణణాతీతం - గాయం, రీఎంట్రీపై శ్రేయాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆరు నెలల విరామం తర్వాత తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shreyas Iyer: సుమారు ఆరు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. గత కొంతకాలంగా వెన్ను గాయంతో బాధపడ్డ అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ టెస్టులో అర్థాంతరంగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న అయ్యర్.. ఆరు నెలల తర్వాత తిరిగి టీమిండియాతో చేరాడు. ఈనెల 30 నుంచి జరుగబోయే ఆసియా కప్‌లో రాణిస్తేనే అతడికి అక్టోబర్ నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కనుంది. ఆసియా కప్‌కు ఎంపికైన నేపథ్యంలో తాజాగా అతడు తన గాయం, రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ టీవీతో అయ్యర్ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా చెప్పాలంటే వెన్నులో డిస్క్ జారడంతో దాని ప్రభావం నా నరాలపై పడింది. ఆ నొప్పి నా శరీరంలోని ప్రతి పార్ట్‌కు తాకింది. నా కాలి బొటనవేలు కూడా నొప్పి ఉండేది. అది చాలా భయంకరంగా అనిపించింది. ఆ నొప్పిని నేను మాటల్లో వర్ణించలేను. నాకు చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. అయితే చాలాకాలంగా నేను ఇంజెక్షన్లు తీసుకుని తక్షణ ఉపశమనం పొందేవాడిని. అలాగే కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాను. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వతంగా శస్త్ర చికిత్స చేయించుకోవడమే మార్గమని గ్రహించి ఆ దిశగా ముందడుగు వేశాను..
నాకు ఇంకా సుదీర్ఘ కెరీర్ ఉంది గనక ఆపరేషన్‌కు వెళ్లడమే మంచిదనుకున్నాను. లండన్‌లో సర్జరీ అయ్యాక అక్కడే రెండు వారాలు ఉండి విశ్రాంతి తీసుకున్నా. అక్కడ్నుంచి వచ్చి నేరుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో జాయిన్ అయ్యా. నేను కోలుకునే క్రమంలో నా కెరీర్ ముగిసిపోతుందేమనన్న భయం కూడా వేసేది. కానీ అప్పుడు ఇక్కడి ఫిజియోలు, కుటుంబసభ్యులు, జట్టు సహచరులు ఇచ్చిన స్ఫూర్తితో మూడు నెలల్లో కోలుకున్నా. ఎన్‌సీఏలో ఫిజియోలు చాలా అండగా నిలిచారు...’ అని చెప్పాడు.
A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 - By @RajalArora #TeamIndia | @VVSLaxman281
— BCCI (@BCCI) August 27, 2023
Full interview 🎥🔽
సర్జరీ తర్వాత మూడు నెలలకు కోలుకుని తిరిగి జట్టుతో చేరడం ఆనందంగా ఉందన్నాడు అయ్యర్. గతం మరిచిపోయి ప్రస్తుతం మీదే దృష్టి పెట్టానని చెప్పాడు. ‘ఈ ప్రయాణంలో నాకు అన్నింటికంటే ఓపిక చాలా ముఖ్యమని అర్థమైంది. నేను ఇంత తక్కువ సమయంలో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం నా ఫిట్‌నెస్‌పై నేను చాలా సంతోషంగా ఉన్నా. యో యో టెస్టులో కూడా పాస్ అయినందుకు హ్యాపీగా ఉంది..’ అని తెలిపాడు. బీసీసీఐ ఈ వీడియోను తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
శ్రేయాస్ అయ్యర్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా తొడ కండరాల గాయం నుంచి కోలుకుని ఆసియా కప్‌కు సన్నద్ధమవుతున్నాడు. మిడిలార్డర్‌లో నెంబర్ - 4 స్థానాన్ని భర్తీ చేసేదిశగా ఈ ఇద్దరూ సమాయత్తమవుతున్నారు. ఆసియా కప్‌లో రాణించడం ఈ ఇరువురికీ ఎంతో కీలకం. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాత మ్యాచ్ ఆడని అయ్యర్.. మే లో ఐపీఎల్ లో గాయపడి అనంతరం మూడు నెలల తర్వాత బ్యాట్ పడుతున్న రాహుల్‌లు ఆసియా కప్ లో ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial