T20 World Cup 2024: పాకిస్థాన్ , భారత్ మ్యాచ్ కంటే హై టెన్షన్ థ్రిల్లర్ చూడలేం - బూమ్ బూమ్ ఇవ్వని కిక్ ఇచ్చిన బుమ్రా
Ind vs Pak Match Highlights: ఇలాంటి మ్యాచ్ ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇకపై చూడలేమేమో. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ 120పరుగులకు ఆలౌట్ అవ్వడం ఒకెత్తైతే లక్ష్య ఛేదనలో పాక్ 113లకే చాపచుట్టేయడం మరో షాక్.
Jasprit Bumrah : అలా కాదండీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే మనోళ్లు చచ్చీ చేడి చెమటోడ్చి పాకిస్థాన్‌కి ఇచ్చిన టార్గెట్ 120 పరుగులు. ఎంత బౌలింగ్ పిచ్ అయినా టీ20ల్లో అది జుజుబీ. పాకిస్థాన్ కూడా ఏదో పడుతూ లేస్తూ ఆడేస్తుంది. మన బౌలర్లు ఏమో అంతంత మాత్రంగానే వేస్తున్నారు. పరుగులు అయితే ఆపుతున్నారు వికెట్లు మాత్రం పడటం లేదు. ఆ ఇంక ఏముందిలే అర్థరాత్రైపోయింది పడుకోండి అని రావు రమేష్ స్టైల్‌లో భారతీయ అభిమానులు వాళ్లకు వాళ్లు సర్ది చెప్పుకుంటున్న టైమ్‌లో వచ్చాడండీ ఒకడు. అసలు ఆశలు లేని మ్యాచ్‌లో ఆశలు కల్పిస్తూ. బూమ్ బూమ్ బ్రాండ్ తాగినా రాని కిక్కును తన పదునైన యార్కర్లతో ఎక్కిస్తూ పాకిస్థాన్‌కు అయితే పిచ్చెక్కించాడు.
ఆఖరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేస్తే చాలు పాకిస్థానోళ్లు గెలిచిపోతారు చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. అయినా సరే వరల్డ్ కప్పుల్లో మా మీద మీకంత సీన్ లేదనురా అన్నట్లు...గెలిచేద్దామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన బాబర్ అజామ్ బ్యాచ్‌కి పట్టపగలే న్యూయార్క్‌లో చుక్కలు చూపించారు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ఇది నాదే అన్నట్లు లాగేసుకుని పాక్‌ను 113 పరుగులకే పరిమితం చేశారు.
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్. అందులోనూ అన్నింటి కంటే హై ఇచ్చే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్. రైవల్రీ అంటే మాదేరా అన్నట్లు ఎప్పుడూ సాగే ఈ మ్యాచ్‌లో ఈసారి పిచ్ రెండు టీమ్స్‌ను పేకాడేసింది. అసలే కోతి పైగా కల్లు తాగినట్లు...అసలే పిచ్చి పిచ్చి టర్నింగ్ పిచ్‌లు...పైగా వర్షం పడింది. ఇక మనోళ్ల తిప్పలు చూడాలి. హిట్ మ్యాను రోహిత్, కింగ్ కొహ్లీ నుంచి మొదలుపెట్టి ఆఖర్లో అర్ష్ దీప్ వరకూ అందరూ నానా ఇబ్బందులూ పడి 120 పెట్టారు.
ఈ టార్గెట్‌ను టీ20ల్లో బౌలర్లు కాపాడాలి అంట. మన అర్ష్ దీప్, మన సిరాజ్ బాగానే వేశారు కానీ వికెట్లు పడటం లేదు. అదిగో ఆ టైమ్‌లో వచ్చాడు హీరో. అరర్రర్రే ఏమన్నా బౌలింగా అది. వాళ్ల ఏకైక బ్యాటింగ్ దిగ్గజం బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది బుమ్రానే. ఐదో ఓవర్లలో బుమ్రా వేసిన బాల్ ఎడ్జ్ తీసుకుంటే సూర్యు స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
అక్కడ మొదలు బుమ్రాను కొట్టడం కాదు అసలు బ్యాట్‌కి బాల్ టచ్ చేయటం కూడా గగనమైపోయింది పాక్ బ్యాటర్లకు. మళ్లీ పది ఓవర్ల తర్వాత బౌలింగ్ వచ్చిన బూమ్ బూమ్ ఈసారి తనకు తాను పోరాట యోధుడినని బిల్డప్ ఇచ్చుకునే మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు. మాములుగా కాదు. బుమ్రా వేసిన ఆ యార్కర్ లెంగ్త్ బాల్‌ని స్లాగ్ చేద్దామనుకున్న సదరు పోరాట యోధుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత 19 ఓవర్ బౌలింగ్ చేసి మూడంటే మూడు పరుగులు ఇచ్చి ఇఫ్తికార్ అహ్మద్ వికెట్ తీశాడు. ఇకంతే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. అర్ష్ దీప్ ఆఖరి ఓవర్లో బాదించుకున్నా కూడా టీమిండియానే గెలిచింది. నాలుగు ఓవర్లలో కేవలం 14పరుగులు మాత్రమే ఇచ్చి బుమ్రా తీసిన మూడు వికెట్లు ఈ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాయి. అద్భుతమైన బౌలింగ్‌తో అనూహ్యంగా టీమిండియాను గెలిపించిన జస్ ప్రీత్ బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.