T20 World Cup 2022: ప్రపంచకప్‌లో ఫుడ్‌పై టీమ్‌ఇండియా అసంతృప్తి! లంచ్ టైమ్‌లో సాండ్‌విచ్‌లేంటని రుసరుస!
Team India: ఐసీసీ భోజన ఏర్పాట్లపై టీమ్‌ఇండియా అలక బూనిందని సమాచారం! ప్రాక్టీస్ చేసిన తర్వాత వేడి వేడి ఆహారం అందించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

T20 World Cup 2022: ఐసీసీ భోజన ఏర్పాట్లపై టీమ్‌ఇండియా అలక బూనిందని సమాచారం! ప్రాక్టీస్ చేసిన తర్వాత వేడి వేడి ఆహారం అందించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిర్వాహకులు అందించిన చల్లని సాండ్‌విచ్‌లు, పండ్లపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని పీటీఐ రిపోర్టు చేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజయంతో బోణీ చేసింది. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ను ఓడించింది. తర్వాతి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకుంది. మంగళవారం అక్కడ రెండు గంటల పాటు కఠోరంగా సాధన చేసింది. అప్పటికే లంచ్ టైమ్ అవ్వడం, ఆ సమయంలో చల్లని అల్పాహారం ఇవ్వడం వారిని అసంతృప్తికి గురి చేసింది.
Indian team is unhappy with the food after practice at Sydney, they were given just sandwiches and told ICC that it was cold & not good. (Source - ANI)
— Johns. (@CricCrazyJohns) October 26, 2022
సాధారణంగా ద్వైపాక్షిక సిరీసులు జరిగినప్పుడు ఆతిథ్య దేశం భారతీయులకు వేడి వేడి ఆహారం అందిస్తుంది. మధ్యాహ్నం ఆటగాళ్లు కోరుకున్నవి వడ్డిస్తుంది. ఆస్ట్రేలియాలో ఇలా జరగడం లేదని తెలిసింది. సాండ్‌విచ్‌లు, పండ్లు, పళ్ల రసాలు అందించిందట. అన్ని జట్లకూ ఐసీసీ ఇలాగే చేస్తోందని తెలిసింది. కఠోర సాధన తర్వాత ఆ ఆహారం సరిపోదని, అందులోనూ వేడిగా లేకపోవడం దారుణమని టీమ్‌ఇండియా యాజమాన్యం అంటోంది.
'ఇది బాయ్‌కాట్ లాంటిదేమీ కాదు.. కొందరు ఆటగాళ్లు పండ్లు, రసాలు తీసుకున్నారు. కానీ అందరూ భోజనం ఆరగించాలని భావించారు. అందుకే హోటల్‌కు వెళ్లి తినాలని అనుకున్నారు' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 'మధ్యాహ్నం సమయంలో ఐసీసీ వేడి వేడి ఆహారం వడ్డించకపోవడమే అసలు సమస్య. ద్వైపాక్షిక సిరీసుల సమయంలో ఆతిథ్య సంఘం క్యాటరింగ్ బాధ్యతలు తీసుకుంటుంది. ట్రైనింగ్ సెషన్ల తర్వాత వేడి వేడి భారతీయ ఆహారం అందిస్తారు. ఐసీసీలో అన్ని దేశాలకూ ఒకే నిబంధన ఉంది' అని పేర్కొన్నారు.
I think ICC controls this
— Johns. (@CricCrazyJohns) October 26, 2022
'రెండు గంటల కఠోర సాధన తర్వాత అవకాడో, టొమాటో, దోసకాయతో కూడిన చల్లని సాండ్‌విచ్ సరిపోదు. ఇది చాలా సింపుల్ ఆహారం. పోషణకు సరిపోదు' అని ఆయన తెలిపారు. కాగా మున్ముందు ట్రైనింగ్ సెషన్ల తర్వాత బీసీసీఐ సొంతంగా ఆహారం సమకూర్చుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
సిడ్నీలో మంగళవారం టీమ్‌ఇండియా ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కఠోరంగా సాధన చేశారు. కేటాయించిన సమయాన్ని మించే చెమటోచ్చారు. తొలి మ్యాచులో వీరిద్దరూ అంచనాలను అందుకోలేదు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ సైతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్ సాధన చేయలేదు. తగినంత విశ్రాంతి ఇవ్వాలన్నదే ఉద్దేశం. సెషన్ ముగిసిన వెంటనే సిడ్నీలో వర్షం కురవడం మొదలైంది. బుధవారం ఎలాగూ మ్యాచ్ లేదు. గురువారం వరకు పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నారు.




















