Rishabh Pant News: ఆసియాకప్ లో పంత్ కు నో ఛాన్స్..! ఆ సమీకరణాలే కారణం.. గంభీర్ ఆలోచన ఏంటంటే..!
ఆసియాకప్ లో పాల్గొనే భారత జట్టుపై చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో దుమ్ము రేపిన కొంతమందికి ఈ మెగాటోర్నీలో చోటు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తుంది.ముఖ్యంగా పంత్ గురించి చర్చ జరుగుతోంది.

Asia Cup 2025 Latest News: టీ20 ఫార్మాట్ లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఘనత వహించిన విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు వచ్చేనెలలో జరిగే ఆసియా కప్ లో భారత జట్టులో స్థానం దక్కక పోవచ్చని తెలుస్తోంది. తను ఆడే వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి పోటీ మెండుగా ఉండటం.. ఈ ఏడాది ఇప్పటికే ఈ స్థానంలో సంజూ శాంసన్ పాతుకుపోవడం కూడా మైనస్ పాయింట్ గా మారిపోయింది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజూను పొట్టి ఫార్మాట్ గా పరిగణనలోకి తీసుకుంటోంది. తను ఓపెనర్ కూడా కావడం కలిసి వస్తోంది. దీంతో పొట్టి ఫార్మాట్ లో అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. త్వరలో ప్రకటించబోయే ఆసియా కప్ లో సంజూకే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. అతనికి రిజర్వ్ లుగా జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్ లను ఎంపిక చేసే అవకాశముంది. దీంతో పంత్ కు పొట్టి ఫార్మాట్ లో జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు ప్రస్తుతానికి మూసుకు పొయ్యాయని తెలుస్తోంది.
ఘోరంగా విఫలం..
పొట్టి ఫార్మాట్ లో పంత్ కు గడ్డుకాలం గతేడాది నుంచి సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో గతేడాది ఐదు మ్యాచ్ లు ఆడిన పంత్ కేవలం 70 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 17.50 కాగా, స్ట్రైక్ రేట్ 127 మాత్రమే కావడం విశేషం. డేంజరస్ బ్యాటర్ అయిన పంత్ నుంచి ఇలాంటి గణాంకాలు నిరాశకు గురి చేస్తున్నాయి. దీంతో పొట్టి ఫార్మాట్ లో తను చోటు కోల్పోయాడు. వన్డేల్లో కూడా తను జాతీయ జట్టుకు ఆడటం ప్రస్తుతం కష్టంగా మారింది. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. దీంతో పంత్ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ ఫార్మాట్ లో తనను కొట్టే వారు లేకుండా పోయారు.
గంభీర్ విముఖత..
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఇందులో ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్రను పోషించారు. దీంతో వీరికి తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లకు ఆసియా కప్ లో చోటు దక్కడం కష్టంగా మారింది. జైస్వాల్, సుదర్శన్ యువకులు కాగా, టీ20 ప్రణాళికల్లో రాహుల్ కనిపించడం లేదు. తను మూడేళ్ల కిందట చివరి టీ20ఐ ఆడాడు. ఈక్రమంలో వచ్చేనెలలో జరిగే ఆసియాకప్ లో వీరికి మొండిచేయి ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు టెస్టు కెప్టెన్ గా ఇంగ్లాండ్ టూర్ లో తన మార్కును చూపించిన కెప్టెన్ శుభమాన్ గిల్ ఎంపికపై చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది ప్రపంచకప్ ఉన్న రిత్యా.. ప్రస్తుతమున్న జట్టులో మార్పులు చేర్పులు చేయకపోవడాన్ని కోచో గౌతం గంభీర్ సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ కు భారత స్క్వాడ్ ను ప్రకటించే క్రమంలో ఈ విషయాలపై క్లారీటీ వస్తుంది.




















