Faf du Plessis Fined: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్ - కెప్టెన్‌కు భారీ జరిమానా
RCB vs LSG: సోమవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పోరాడి ఓడింది.
Faf du Plessis Fined: సొంత మైదానంలో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్న ఓటమి బాధలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి ఫాఫ్ డుప్లెసిస్‌కు మరో భారీ షాక్ తాకింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేయడమే దీనికి కారణం. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
లక్నో ఇన్నింగ్స్ లో భాగంగా నిర్దేశించిన సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో ఆర్సీబీ విఫలమైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆఖరి ఓవర్లో ఇన్‌సైడ్ సర్కిల్ లో ఎక్స్ ట్రా ఫీల్డర్ ను ఉంచాల్సి వస్తుంది. దీంతో బౌండరీ లైన్ వద్ద నలుగురే ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. లక్నోతో మ్యాచ్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ చేసినప్పుడు కూడా చివరి ఓవర్లో ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉన్నారు. సింగిల్స్ కట్టడి చేయడం కోసం ఆఖరి ఓవర్లో ఇది ఉపయోగపడ్డా ఆఖరికి మ్యాచ్ మాత్రం చేజారింది.
డుప్లెసిస్ భారీ సిక్స్..
చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఓడిపోయినా ఆర్సీబీతో పాటు కెప్టెన్ డుప్లెసిస్ పలు రికార్డులను నమోదు చేశాడు. ఈ సీజన్ లో అత్యంత భారీ సిక్సర్ ను నమోదు చేశాడు. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి డుప్లెసిస్.. 115 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్ లో ఇదే రికార్డు. ఐపీఎల్ లో లాంగెస్ట్ సిక్సర్ బాదిన ఘనత సీఎస్కే ప్లేయర్ ఆల్బీ మోర్కెల్ పేరిట ఉంది. మోర్కెల్.. 2008లో ద 125 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. కాగా డుప్లెసిస్ సిక్సర్ కొట్టినప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న మ్యాక్స్‌వెల్ తో పాటు డగౌట్ లో ఉన్న విరాట్ కోహ్లీలు కళ్లప్పగించి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
లక్నోతో మ్యాచ్ లో భాగంగా డుప్లెసిస్ మరో ఘనత అందుకున్నాడు. ఈ లీగ్ లో అతడు 3,500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 46 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు డుప్లెసిస్. తద్వారా ఐపీఎల్ లో 3,500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న డుప్లెసిస్.. ఇప్పటివరకు 119 మ్యాచ్‌లలో 112 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 3,578 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 96 రన్స్. ఐపీఎల్ లో డుప్లెసిస్ పేరిట 27 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
పూరన్ - స్టోయినిస్ షో..
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 23 పరుగులకే 3 కీలక వికెట్లు పడ్డా లక్నో మిడిలార్డర్ బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్ (65), నికోలస్ పూరన్ (62) లు విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం లక్నోనే వరించింది.