PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ కుమారులను ఇంటర్వ్యూ చేసిన వివాదంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్‌లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది.

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రస్తుతం జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ కామెంట్రీ ప్యానెల్ విషయంలో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు, ప్రముఖ వ్యాఖ్యాతలు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్‌లను కామెంట్రీ ప్యానెల్ నుంచి పూర్తిగా తప్పించింది. పీసీబీ ప్రకటించిన ఆరుగురు సభ్యుల ప్యానెల్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ కుమారులతో స్కై స్పోర్ట్స్ వేదికగా ప్రసారమైన ఒక వివాదాస్పద ఇంటర్వ్యూయే ఈ కఠిన చర్యకు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో లార్డ్స్ టెస్ట్ సందర్భంగా ఇమ్రాన్ కుమారులైన కాసిమ్, సులేమాన్ ఖాన్‌లను అథర్టన్ ఇంటర్వ్యూ చేశాడు. 2024లో ఇంగ్లాండ్ పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు కామెంట్రీ టీమ్‌లో ప్రధాన సభ్యులుగా వ్యవహరించడం గమనార్హం.
ఇమ్రాన్ కుమారుల సంచలన ఆరోపణలు: హత్యకు యత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు
ఆ ఇంటర్వ్యూలో కాసిమ్, సులేమాన్ పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్య సహాయం అందించకుండా, ఒంటరిగా ఉంచి తమ తండ్రిని హత్య చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. జైళ్లలో పలువురు రాజకీయ ఖైదీలు అనుమానాస్పదంగా మరణించారని, తమ తండ్రికి కూడా అదే గతి పట్టించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించిన మాజీ ప్రధాని రోజుకు 23 గంటలకు పైగా ఒక చిన్న గదిలోనే గడపాల్సి వస్తోందని వాపోయారు. తమకు వీసాలు ఇచ్చేందుకు కూడా అధికారులు నిరాకరించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్‌ను బంధువులు, న్యాయవాదులు, వైద్యులు కలవకుండా ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది.
మ్యాచ్ బాయ్‌కాట్ బెదిరింపులు: స్కై స్పోర్ట్స్‌పై పీసీబీ తీవ్ర ఆగ్రహం
రాజకీయ అంశాలతో కూడిన ఆ ఇంటర్వ్యూ ప్రసారం కావడంపై పీసీబీ అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ మ్యాచ్‌లో మధ్యాహ్నం సెషన్ ఆటను బాయ్‌కాట్ చేస్తామని, మైదానంలోకి ఆటగాళ్లను పంపబోమని బెదిరించింది. అంతేకాకుండా స్కై స్పోర్ట్స్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ పీటీవీ దేశీయంగా ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయకుండా తొలగించింది. ఆ పాత కక్షలను మనసులో పెట్టుకునే ఇప్పుడు హోమ్ సిరీస్ నుంచి అథర్టన్, నాజర్ హుస్సేన్‌లను పక్కన పెట్టింది.
క్షీణిస్తున్న ఇమ్రాన్ ఆరోగ్యం: కంటిచూపు కోల్పోయిన మాజీ కెప్టెన్
2023 నుంచి జైలులో ఉంటున్న 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆయన ఇప్పటికే 75 శాతం కంటిచూపు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్‌కు వెంటనే అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని పలువురు ప్రపంచ క్రికెట్ ప్రముఖులు పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు



















