PAK vs CAN, T20 World Cup 2024: కెనడాపై పాక్ విజయం, సజీవంగా ఉన్న సూపర్ 8 ఆశలు
Pakistan vs Canada: పసికూన అమెరికా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్... కెనడాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సాధికార విజయాన్ని సాధించింది.
స్వల్ప స్కోర్లే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కెనడా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించగా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్-ధలీవాల్ తొలి వికెట్‌కు మూడు ఓవర్లలో 20 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద మొదలైన కెనడా వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. ఓ వైపు ఆరోన్ జాన్సన్ ఒంటరి పోరాటం చేస్తున్నా అతడికి మద్దతు ఇచ్చే మరో బ్యాటర్ లేకుండా పోయాడు. అయినా పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆరోన్ జాన్సన్ 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లో 52 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవరూ 15 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు. దీంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అమీర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చాడు. హరీస్ రౌఫ్ 2, షహీన్ షా అఫ్రీదీ 1, నసీమ్ షా ఒక వికెట్ తీశారు.
సునాయసంగానే..
107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన ఓపెనర్ సయీమ్ ఆయూబ్‌ను... హెలిజర్ అవుట్ చేసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. కెనడా మరో అద్భుతం చేస్తుందా అనిపించింది. కానీ పాక్ బ్యాటర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ కెనడాకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. లక్ష్యం పెద్దగా లేకపోవడంతో ఆచితూచి బ్యాటింగ్ చేసి పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించారు. రిజ్వాన్ 53 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 33 పరుగులు చేసి హెలిజర్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. వీరిద్దరూ రాణించడంతో పాక్ లక్ష్య చేధన సులువుగా మారింది. అనంతరం ఫకర్ జమాన్ నాలుగు పరుగులే చేసి అవుటైనా రిజ్వాన్ కడదాక క్రీజులో నిలిచి పొట్టి ప్రపంచకప్‌లో పాక్ తొలి విజయాన్ని అందించాడు.