ODI World Cup 2023: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బీసీసీఐ - ఖాళీ స్టేడియంలోనే పాక్, కివీస్ మ్యాచ్
ఇదివరకే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఓసారి సవరించిన బీసీసీఐ, ఐసీసీ మరోసారి షెడ్యూల్ సవరణకు మొగ్గుచూపలేదు. షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది.
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి (ఉప్పల్ స్టేడియం) ఇచ్చిందే మూడు మ్యాచ్‌లు అంటే వాటిని కూడా తనివితీరా చూసే అవకాశం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. టికెట్లు తీసుకున్న అభిమానులకు వారి నగదును రీఫండ్ చేయనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈనెల 29న పాకిస్తాన్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగబోయే తమ ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని రాష్ట్ర పోలీసు శాఖ ఇదివరకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 28న నగరంలో భారీగా నిర్వహించే గణేష్ నిమజ్జనంతో పాటు అదే రోజు మిలాన్ ఉన్ నబి పండుగల కారణంగా మ్యాచ్‌కు భద్రతను కల్పించలేమని, వీలైతే మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని హెచ్‌సీఏను కోరింది. ఇదే విషయాన్ని హెచ్‌సీఏ.. బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది.
ఇదివరకే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఓసారి సవరించిన బీసీసీఐ, ఐసీసీ మరోసారి షెడ్యూల్ సవరణకు మొగ్గుచూపలేదు. షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది. అంతేగాక అక్టోబర్ 9, 10న ఇక్కడ జరుగబోయే వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్‌లపై కూడా భద్రతా దళాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్, మరుసటి రోజే పాకిస్తాన్ - శ్రీలంక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు కనీసం 3 వేల మంది పోలీసుల అవసరం ఉంటుందని, అలాగే టీమ్ హోటల్స్, ఆటగాళ్లకు ప్రత్యేక భద్రత కలిగించాల్సిన అవసరం ఉండటంతో ఈ షెడ్యూల్‌ను మార్చాలని కోరినా బీసీసీఐ పట్టించుకోలేదు.
No crowd allowed in the Pakistan Vs New Zealand warm up match in Hyderabad on 29th September due to lack of adequate security. (Indian Express). pic.twitter.com/fHvHPW9cvx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2023
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన మ్యాచ్‌ను నవరాత్రి ఉత్సవాల ఆరంభాల సందర్భంగా ఒకరోజుకు ముందుకు జరిపారు. దాయాదుల పోరు అక్టోబర్ 14న జరగాల్సి ఉంది. అలాగే నవంబర్ 12న భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఈడెన్ గార్డెన్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను కాళీ మాత పూజ ఉండటంతో నవంబర్ 11కు మార్చారు. షెడ్యూల్ మార్పుపై విమర్శలు కూడా వెల్లువెత్తిన తరుణంలో బీసీసీఐ మళ్లీ దీనిజోలికి పోలేదు. అదీగాక పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య సెప్టెంబర్ 29న జరిగేది వార్మప్ మ్యాచే కావడంతో దీనికి అంత ప్రాధాన్యం కూడా లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మ్యాచ్‌ను చూద్దామని టికెట్లు బుక్ చేసుకున్నవారి నగదును తిరిగి ఇచ్చేయాలని బుక్ మై షో నిర్వాహకులకూ సూచించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Hyderabad Cricket Association wants the Warm-up game between PAK vs NZ on 29th to be reconsidered as security agencies have expressed the inability to provide adequate security due to Ganesh Visarjan & Milan-Un-Nabi. [The Indian Express] pic.twitter.com/3a0HrPaD1C
— Johns. (@CricCrazyJohns) September 10, 2023