AUS vs AFG: పోరాడిన ఆఫ్ఘన్ బ్యాటర్లు, కంగారూల ముందు 292 పరుగుల లక్ష్యం
AUS vs AFG , Innings Highlights: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అఫ్ఘానిస్థాన్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది.
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అఫ్ఘానిస్థాన్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచే అఫ్గాన్ ప్లేయర్లు ఆచితూచి ఆడడంతో పరుగుల రాక కష్టమైంది. ఎనిమిది ఓవర్లలో 38 పరుగుల వద్ద అఫ్గాన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రహ్మత్ షా..ఇబ్రహీం జద్రాన్ అఫ్గాన్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కంగారు బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్న ఈ ఇద్దరు స్కోరును 100 పరుగులు దాటించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మాక్స్ వెల్ విడదీశాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇబ్రాహీం జద్రాన్ పోరాటం ఆపలేదు. సెంచరి పూర్తి అయిన తరువాత భారీ షాట్ లతో విరుచుకు పడ్డాడు. మహమ్మద్ నబీ త్వరగానే అవుట్ అయినా చివర్లో రషీద్ ఖాన్ మెరుపు బాటింగ్ చేశాడు. రహమ్మద్ షా 30, షాహిదీ 26, ఓమరాజాయ్ 22 పరుగులతో రాణించారు. రషీద్ ఖాన్ 18 బంతుల్లో 2 ఫోర్ లు, మూడు సిక్స్ 35 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్క విజయం చాలు. ఆస్ట్రేలియాను ఇప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆందోళనకు గురిచేస్తోంది. కానీ వరుసగా ఐదు విజయాలు సాధించడంతో కంగారులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి ఈ ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు అర్ధసెంచరీలు చేశారు. ఇదే కంగారులను కంగారు పెడుతోంది. అఫ్గానిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్‌లు ఆడి సెమీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని లబుషేన్, స్మిత్ చూస్తున్నారు. ఇంగ్లండ్‌పై 83 బంతుల్లో 71 పరుగులు చేసి లబుషేన్ పర్వాలేదనిపించాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 61.14 సగటుతో 428 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉండడం ఆసిస్‌కు కలిసి రానుంది. ట్రావిస్ హెడ్ కూడా ఇప్పటికే ఒక సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ నిలబడితే అఫ్గాన్‌కు తిప్పలు తప్పవు. మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరడంతో కంగారుల బ్యాటింగ్ మరింత బలోపేతం అయింది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీమిండియాతోపాటు దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరుకున్నాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు. ఈ రెండు స్థానాల కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా సెమీస్ చేసుకున్న ఆస్ట్రేలియా... అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్ చేరాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సెమీస్ చేరడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అఫ్గాన్ కూడా సెమీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలకు షాక్ ఇచ్చిన అఫ్గాన్... ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది.