Team India New Jersey: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే కొత్త జెర్సీలు - ఘనంగా ఆవిష్కరించిన అడిడాస్
WTC Finals 2023: రోహిత్ సేన మరోమారు కొత్త జెర్సీలతో కనువిందు చేయనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచే టీమిండియాతో వీటిని ధరించనుంది.
Team India New Jersey: ఈనెల 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్డ్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నుంచి భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలలో కనువిందు చేయనుంది. గత నెలలో ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ అడిడాస్.. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం మేరకు.. ఇకనుంచి టీమిండియా (సీనియర్, జూనియర్, మహిళలు) క్రికెటర్లు వేసుకునే జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది.
ఈ మేరకు ముంబైలోని ప్రఖ్యాత స్టేడియం వాంఖెడే వేదికగా మూడు ఫార్మాట్లకు సంబంధించిన మూడు జెర్సీలను అడిడాస్ ఆవిష్కరించింది. డ్రోన్ల సాయంతో జెర్సీలను వాంఖెడే స్టేడియంలో ప్రదర్శించారు. అనంతరం అడిడాస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కూడా కొత్త జెర్సీల ఆవిష్కరించింది.
బీసీసీఐతో ఐదేండ్ల (2028 వరకు) ఒప్పందం మేరకు అడిడాస్ టీమిండియాకు కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది. అంటే దీని ప్రకారం 2028 వరకూ భారత పురుషుల, మహిళల, అండర్ -19, భారత్ - ఎ, బి తో పాటు మహిళల జట్లకూ వారి శిక్షణ, ప్రయాణానికి సంబంధించిన అన్ని దుస్తులను అడిడాసే అందిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
An iconic moment, An iconic stadium
— Adidas India (@adidasindiaoffi) June 1, 2023
Introducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd
టీమిండియా జెర్సీల రంగు మారకపోయినా ‘మెన్ ఇన్ బ్లూ’, ‘ఉమెన్ ఇన్ బ్లూ’ మాత్రం మూడు ఫార్మాట్లకు మూడు రకాల జెర్సీలను ధరించనున్నారు. టెస్టులకు వైట్ అండ్ వైట్ తో ఉండబోయే జెర్సీలలో కొత్తగా భుజాల మీద అడ్డుగీతలు వచ్చాయి. ఎడమ వైపు బీసీసీఐ లోగో, కుడివైపున అడిడాస్ మూడు గీతలు ఉన్న లోగో ఉండనుండగా మధ్యలో ఇండియా అని రాసి ఉంటుంది.
ఇక వన్డేలకు రూపొందించిన జెర్సీలు బ్లూ కలర్ లో ఉండి భుజాల మీద రెండు వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి. బీసీసీఐ లోగో మీద మూడు స్టార్లు.. టీమిండియా సాధించిన ఐసీసీ ట్రోఫీలను సూచిస్తాయి. అయితే టీ20లకు వేసుకునే జెర్సీ మాత్రం కాస్త భిన్నంగా ఉండనుంది. టీ20 జెర్సీలకు కాలర్ లేదు. కొత్త జెర్సీ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.
3 Formats 3 different Jersey's#adidasIndia #adidasTeamIndiaJerseypic.twitter.com/mnIRRsTQ3h
— Adidas India (@adidasindiaoffi) June 1, 2023
టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్ చరిత్ర..
వన్డేలు, టెస్టులకు విడివిడిగా జెర్సీలను ధరించే విధానం అందుబాటులోకి వచ్చాక ఆయా జట్లు ఈ మేరకు తమ ఆటగాళ్లకు వినూత్న రీతిలో జెర్సీలను అందిస్తోన్నాయి. భారత క్రికెట్ జట్టు జెర్సీలు, వాటి స్పాన్సర్ల చరిత్రను ఓసారి చూస్తే..
- 1993 నుంచి 2002 వరకు టీమిండియా కిట్ స్పాన్సర్ గా విల్స్, ఐటీసీ హోటల్స్ వ్యవహరించాయి. 1993 - 96, 1999 -2001 వరకూ విల్స్ ఉండగా మిగిలిన కాలానికి ఐటీసీ హెటల్స్ కిట్ స్పాన్సర్ చేసింది.
- 2002 నుంచి 2013 దాకా సహారా (సహారా ఇండియా పరివార్) కిట్ స్పాన్సర్ గా ఉంది.
- 2014 నుంచి 2017 దాకా స్టార్ (స్టార్ ఇండియా) వ్యవహరించింది.
- 2017 నుంచి 2022 దాకా ఒప్పో ఒప్పందం కుదుర్చుకున్న మధ్యలో పలు కారణాలతో అది రద్దై బైజూస్ టీమిండియా కిట్ స్పాన్సర్ గా ఉంది.
- బైజూస్ ఒప్పందం ముగియడంతో మధ్యలో కొన్నాళ్లు ఎంపీఎల్, కెవాల్ కిరణ్ (కిల్లర్ జీన్స్) తాత్కాలిక స్పానర్లుగా వ్యవహరించాయి. ఇక 2023 జూన్ నుంచి 2028 వరకూ ఐదేండ్ల పాటు బీసీసీఐకి అడిడాస్ కిట్ స్పాన్సర్ గా ఉండనుంది.