KL Rahul: ఆసియా కప్‌కు రాహుల్ అనుమానమే - అయ్యర్ పరిస్థితి మరీ ఘోరం - టీమిండియాకు మిడిలార్డర్ కష్టాలు?
వన్డే వరల్డ్ కప్ ముంచుకొస్తున్న వేళ భారత జట్టుకు మిడిలార్డర్ కష్టాలు తప్పేలా లేవు. గాయాల బారిన పడ్డ కీలక ఆటగాళ్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు.
KL Rahul: వన్డే వరల్డ్ కప్‌కు మరో రెండు నెలల సమయమే ఉన్నా భారత జట్టులో గాయాల బారిన పడ్డ ఆటగాళ్లు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్లుగా ఉన్న కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ఇప్పుడప్పుడే భారత జట్టులోకి వచ్చేలా కనిపించడం లేదు. ప్రపంచకప్ కంటే ముందు జరగాల్సిన ఆసియా కప్ వరకైనా వీళ్లిద్దరూ కోలుకుంటారనుకుంటే తాజా సమాచారం ప్రకారం అది కష్టమే అని తెలుస్తున్నది.
ఐపీఎల్ - 16 ఆడుతూ తొడ కండరాలు పట్టేడయంతో అర్థాంతరంగా సీజన్ నుంచి తప్పుకున్న రాహుల్‌కు మే లో శస్త్రచికిత్స పూర్తయింది. ఆ తర్వాత అతడు బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో రీహాబిటేషన్ పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్.. ఆగస్టు మాసాంతంలో జరిగే ఆసియా కప్ వరకైనా అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఆ దిశగా కృషి చేస్తున్నట్టు ఎన్సీఎలో రాహుల్ చేస్తున్న వర్కవుట్స్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం రాహుల్ ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదట. ఆసియా కప్ ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరుగనున్న నేపథ్యంలో.. 50 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసి బ్యాటింగ్ చేసేంత మ్యాచ్ ఫిట్నెస్‌ను రాహుల్ ఇంకా పొందలేదని ఎన్సీఎ వర్గాలు చెబుతున్నాయి. ఆసియా కప్‌లో అతడు ఆడేది అనుమానమే అని కానీ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడబోయే మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అయితే అది కూడా అతడు ఫిట్నెస్‌ను బట్టి ఆధారపడి ఉందని ఎన్సీఎ ప్రతినిధి ఒకరు చెప్పారు.
KL Rahul and Shreyas Iyer unlikely to be picked for Asia Cup 2023. (Cricbuzz). pic.twitter.com/2VNgXhkO9u
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2023
రాహుల్ కథ ఇలా ఉంటే శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో అర్థాంతరంగా వెన్నునొప్పితో బాధపడ్డ అయ్యర్ కూడా మే లోనే శస్త్రచికిత్స చేసుకున్నాడు. సర్జరీ తర్వాత అయ్యర్ ఎన్సీఎలో ఉంటూనే పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతున్నాడు. రాహుల్ మాదిరిగానే అయ్యర్ కూడా కొద్దిరోజుల క్రితమే బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ రాహుల్‌తో పోల్చితే అయ్యర్ ఇప్పుడప్పుడే టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేట్టు కనిపించడం లేదు. అయ్యర్ ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లే కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది.
భారత జట్టుకు ఇప్పటికే మిడిలార్డర్‌లో సరైన కూర్పు లేక ఇబ్బందులు పడుతోంది. టీ20లలో అదరహో అనిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. సంజూ శాంసన్‌కు అవకాశాలు వచ్చేదే తక్కువ. అడపాదడపా ఇచ్చిన అతడు భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్, అయ్యర్‌లు వన్డే వరల్డ్ కప్ వరకైనా పూర్తిస్థాయిలో కోలుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial