Bumrah Record: 'బుమ్రా'స్త్రం.. అత్యధిక ఐసీసీ పాయింట్లను సాధించిన బౌలర్ గా రికార్డు.. కపిల్, కుంబ్లే, బేడీల వల్ల కాని రికార్డును కొల్లగొట్టిన స్పీడ్ స్టర్
Bumrah Recordటెస్టు క్రికెటర్లో ఏ దిగ్గజ భారత బౌలర్ కు సాధ్యం కాని ఘనతను బుమ్రా తన సొంతం చేసుకున్నాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో బుమ్రా ఈ రికార్డు సాధించాడు.
ICC Test Rankings: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇండియన్ క్రికెట్ బౌలింగ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఇప్పటివరకు టెస్టు చరిత్రలో దిగ్గజాలు ఎంతమంది ఆడినా, ఏ భారత బౌలర్ సాధించని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో 907 పాయింట్లతో తన నెం.1 ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక ఐసీసీ రేటింగ్ పాయింట్లు (904) సాధించిన భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. నిజానికి గతవారమే 904 పాయింట్లు సాధించి, ఉమ్మడిగా అశ్విన్ సరసన నిలిచిన బుమ్రా, తాజాగా అతడిని అధిగమించాడు.
🚨 JASPRIT BUMRAH - INDIA'S HIGHEST RATED BOWLER IN HISTORY WITH 907 POINTS. 🚨 pic.twitter.com/M3CVxSYnrW
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 1, 2025
ఏడాదిలో 71 వికెట్లు..
గతేడాది బుమ్రా కెరీర్ మరపురానిదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా 71 వికెట్లు తీసిన బుమ్రా.. నెం.1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ లో 30 వికెట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. గతవారం ముగిసిన నాలుగో టెస్టులో 9 వికెట్లు సాధించడంతో తన రేటింగ్ పాయింట్లు మెరుగయ్యాయి. దీంతో అత్యధిక ఐసీసీ పాయింట్లను సాధించిన జాబితాలో సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సిడ్నీ బార్న్స్ (932 పాయింట్లు) ఉన్నాడు. ఈనెల 3 నుంచి సిడ్నీ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రా ప్రస్తుతమున్న ఫామ్ లో మరిన్ని పాయింట్లను సాధించే అవకాశముంది. ఇక బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్ట్ 4వ ర్యాంకును దక్కించుకున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 20 స్థానాలు ఎగబాకి, 53వ ర్యాంకులో నిలిచాడు.
ఐసీసీ అవార్డులకు నామినేట్..
గతేడాది ప్రదర్శనకు గాను ఐసీసీ అందించే ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) , ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు. తాజాగా ప్రకటించిన అప్డేట్ లో తను ఈ అవార్డులకు షార్ట్ లిస్టు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అవార్డుల విన్నర్ల పేర్లను ఐసీసీ ప్రకటించనుంది. బుమ్రా జోరును చూస్తుంటే ఈ రెండు అవార్డును అతనే కైవసం చేసుకునే అవకాశముంది. మరో రికార్డుపైనా బుమ్రా కన్నేసినట్లు తెలుస్తోంది. బీజీటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్భజన్ సింగ్ (32 వికెట్లు-2001) పేరిట ఉన్న రికార్డను బుమ్రా బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ లో 30 వికెట్లు తీసిన బుమ్రా.. మరో మూడు వికెట్లు తీస్తే ఈ రికార్డు బద్దలు అవుతుంది. అయితే అది సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అందుకుంటాడో లేక రెండో ఇన్నింగ్స్ లో అందుకుంటాడా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.