(Source: ECI/ABP News/ABP Majha)
Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా రాకతో బుమ్రా అసహనం! ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?
Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై జట్టులో చేరడంపై బుమ్రా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో హార్దిక్ పాండ్యా(Hardic Pandya) జట్టు మార్పు వ్యవహారం సంచలనంగా మారింది. ఊహాగానాలను నిజం చేస్తూ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను వీడి తిరిగి ముంబై(Mumbai) గూటికి చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్ నుంచి తిరిగి ముంబైకి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యాను ముంబయి జట్టు సొంతం చేసుకుంది. పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడడంతో నూతన కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఆ జట్టు ప్రకటించింది. పాండ్యా జట్టులో చేరడం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హర్షం కూడా వ్యక్తం చేశారు. ఇక అంత బాగానే ఉందనుకుంటున్న తరుణంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.
హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై జట్టులో చేరడంపై బుమ్రా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనికి ఆజ్యం పోసినట్లు బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ మరింత వైరల్‌గా మారింది. కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుత్తమ సమాధానంగా నిలుస్తుందని బుమ్రా పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో... బుమ్రా కెప్టెన్ కావాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ చేపట్టడం ఖాయమని భావిస్తున్న వేళ బుమ్రా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ తర్వాత ముంబై నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే బుమ్రా ఇన్నాళ్లూ జట్టుతో కొనసాగాడని.. పాండ్యా మళ్లీ ముంబైలో చేరడంతో బుమ్రా ఆశలు నేరవేరలేదని మరికొందరు అంటున్నారు. అందుకే ఇన్‌స్టాలో ఇలాంటి పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు బుమ్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఆర్సీబీని ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. బెంగళూరు ఫ్రాంఛైజీతో బుమ్రా ఒప్పందం చేసుకుంటాడని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌తో కూడా బుమ్రా జట్టు కట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బుమ్రా అధికారికంగా ఈ విషయంపై స్పందిస్తేనే స్పష్టత వస్తుంది.
IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ జరిగి హార్దిక్ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడు. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించడం సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఒప్పందం మీద రెండు ఫ్రాంచైజీలు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొంది. హార్దిక్ పాండ్యా కొనుగోలు పూర్తయిందని.. ఇప్పుడతను ముంబయి ఆటగాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గ్రీన్‌ను బెంగళూరుకు ముంబయి ఇచ్చేసిందని ఆ తర్వాత హార్దిక్‌ను సొంతం చేసుకుందని ఆయన వెల్లడించారు. హార్దిక్ పాండ్యా విషయంలో ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య మధ్య ఒప్పందం కుదిరిందని, హార్దిక్‌కు ఇచ్చే వార్షిక జీతం కాకుండా గుజరాత్‌కు భారీ మొత్తం చెల్లించేందుకు ముంబయి సిద్ధమైందని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు చెప్పాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply