India vs Australia: భారత మహిళల కొత్త చరిత్ర , ఆస్ట్రేలియాపై తొలిసారి టెస్ట్ విజయం
India vs Australia HIGHLIGHTS: స్వదేశంలో భారత అమ్మాయిలు చెలరేగిపోయారు. పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి.... కంగారులపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేశారు.
India vs Australia Test Series Win: స్వదేశంలో భారత అమ్మాయిలు చెలరేగిపోయారు. పటిష్టమైన ఆస్ట్రేలియా(Austrelia)ను మట్టికరిపించి.... కంగారులపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవలే ఏకైక టెస్టులో ఇంగ్లాండ్(England)ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళలు... ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా ఓడించి కొత్త చరిత్రకు నాంది పలికారు. టెస్టు క్రికెట్(Test Cricket) చరిత్రలో ఆసీస్‌పై తొలిసారి భారత మహిళల జట్టు విజయం సాధించింది. ముంబయి(Mumbai)లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకూ 11 టెస్టుల్లో తలపడిన టీమ్ఇండియా(Team India)కు ఇదే తొలి టెస్ట్ విజయం. ఈ విజయంతో మహిళల టెస్ట్ చరిత్రలో భారత మహిళల జట్టు నవ శకానికి నాంది పలికింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారులు తొలుత బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 219 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 406 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. భారత ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడ్డ భారత ఓపెనర్లు... తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 59 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 40 పరుగులు చేసింది. 106 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసిన స్మృతి మంధాన అనవసరంగా రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. జెమీమా రోడ్రిగ్స్ 73, రిచా ఘోష్ 52 పరుగులతో అర్ధ శతకాలు బాదారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపారు. పూజ వస్త్రాకర్ 47 పరుగులతో రాణించడంతో టీమిండియా 406 పరుగులకు ఆలౌట్ అయి... 187 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
ఆసిస్ రెండో ఇన్నింగ్స్ సాగిందిలా...
187 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా... గట్టిగానే పోరాడింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు బెత్ మూనీ (33), లిచ్‌ఫీల్డ్ (18) శుభారంభం అందించారు. వీళ్లిద్దరు తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశారు. తాలియా మెక్‌గ్రాత్ (73; 177 బంతుల్లో 10×4) రాణించింది. ఎలిస్ పెర్రీ (45; 91 బంతుల్లో 5×4) పర్వాలేదనిపించింది. క్రీజ్‌లో పాతుకుపోయిన అన్నాబెల్ సదర్లాండ్ (27)ను స్నేహ్ రాణా ఔట్ చేసింది. అలానా కింగ్ డకౌట్ అయింది. భారత బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ 261 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన స్నేహ్ రాణా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్ 261 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
75 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండే వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది . స్మృతీ మంధాన (38*), జెమీమా రోడ్రిగ్స్ (12*) క్రీజ్‌లో ఉండి గెలిపించారు. షఫాలీ వర్మ 4, రిచా ఘోష్ 13 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు కిమ్ గార్త్, గార్డెన్ చెరో వికెట్ పడగొట్టారు. జట్టులోని ప్రతి సభ్యుల శ్రమతోనే ఈ విజయం సాధించామన్న భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్... ఆసీస్‌పై విజయంతో చరిత్ర సృష్టించామని తెలిపింది.