India vs Australia World Cup Final 2023: 2015 వన్డే ప్రపంచకప్ విజయం, 2022 టెస్టు ఛాంపియన్‌షిప్ గెలుపుతో ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచుల్లో అద్భుతంగా ఆడుతున్నది సుస్పష్టం. ఈ ప్రపంచకప్ సెమీస్‌లోనూ దాన్ని మరోసారి నిరూపిస్తూ ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేస్తూ దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఆటగాళ్లు మారినా.. ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రొఫెషనలిజానికి లోటు ఉండదు. ఓటమిని ఒప్పుకోకుండా తుదికంటా పోరాడే తీరు వారిని భిన్నంగా నిలబెడుతుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ప్రపంచకప్‌లో రెండు ఓటములతో మొదలుపెట్టి తర్వాత ప్రతి మ్యాచ్ గెలుస్తూ కంగారులు ఫైనల్ చేరారు. అఫ్గానిస్థాన్‌పై ఓటమి అంచు నుంచి మ్యాక్స్‌వెల్ గొప్ప పోరాటంతో ఆస్ట్రేలియా గెలిచింది. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లోనూ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ఇవి ఆస్ట్రేలియా పోరాటతత్వానికి నిదర్శనం. అసలు ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రస్థానం ఎలా సాగిందంటే...
తొలి మ్యాచ్‌లో షాక్
ఈ ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాకు టీమిండియా షాక్ ఇచ్చింది. 1999 తర్వాత ఆస్ట్రేలియాను ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే భారత్ ఓడించింది.మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రెండో మ్యాచ్‌లోనూ తప్పని పరాభవం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాకు పరాభవం తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత కంగారులు 177 పరుగులకే కుప్పకూలారు. దీంతో 134 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో ఓటమితో ఆస్ట్రేలియా పనై పోయిందని చాలామంది అంచనా వేశారు.
మూడో మ్యాచ్ నుంచి గాడిలోకి...
శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ నుంచి ఆస్ట్రేలియా మళ్లీ గాడినపడింది. ఈ మ్యాచ్‌లో లంకేయులు తొలుత బ్యాటింగ్ చేసి 209 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి తేలిగ్గా విజయం సాధించింది. ఈ విజయంతో కంగారులు మళ్లీ విజయాల బాటపట్టారు.
పాక్‌ను చిత్తు చేసి..
నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను కంగారులు చిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 367 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పాక్ జట్టును 305 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో 62 పరుగుల తేడాతో కంగారులు విజయం సాధించారు. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.
నెదర్లాండ్స్‌పై ఘన విజయం
పసికూన నెదర్లాండ్స్‌ను అయిదో మ్యాచ్‌లో కంగారులు చిత్తుచిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో 309 పరుగుల తేడాది కంగారులు ఘన విజయం సాధించారు.
న్యూజిలాండ్‌పై పోరాడి గెలిచి
ఈ ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 388 పరుగులు చేసినా సునాయస విజయం దక్కలేదు. న్యూజిలాండ్ కడదాక గొప్పగా పోరాడింది. చివరికి విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో 383 పరుగుల దగ్గర ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో వరుసగా నాలుగో విజయాన్ని కంగారులు తమ ఖాతాలో వేసుకున్నారు.
చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసి
చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను కూడా ఆస్ట్రేలియా సునాయసంగానే ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 286 పరుగులు చేయగా... ఇంగ్లాండ్ 253 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఆసిస్ గెలుపొందింది.
అప్గానిస్థాన్‌పై మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో..
ఇక ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 291 పరుగులు చేసింది. అనంతరం ఆసిస్ 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కానీ మ్యాక్స్‌వెల్ డబల్ సెంచరీతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో సెమీస్‌లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది.
బంగ్లాదేశ్‌పై పోటీ లేకుండానే..
లీగ్ చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 306 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనిని కేవలం 44.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది.
సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై..
లో స్కోరింగ్ మ్యాచ్‌లో మరోసారి ప్రొటీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి తడబడింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయిన వేళ ప్రొటీస్ 49.4 ఓవర్లలో 212 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి... 16 బంతులు మిగిలి ఉండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ స్కోరు చేసినా సౌతాఫ్రికా పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.