IND vs SL 3rd ODI: శ్రీలంకతో మూడో వన్డే- పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు
IND vs SL 3rd ODI: రేపు తిరువనంతపురంలో భారత్- శ్రీలంక మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు కొందరు శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు.
IND vs SL 3rd ODI: రేపు తిరువనంతపురంలో భారత్- శ్రీలంక మధ్య ఆఖరి వన్డే జరగనుంది. మొదటి 2 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో దాంట్లోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అలాగే లంకేయులు ఇందులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు కొందరు శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
సాంప్రదాయ దుస్తుల్లో క్రికెటర్లు
శ్రీలంకతో మూడో వన్డేకు ముందు భారత ఆటగాళ్లు కొందరు తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ ఇంకా కొందరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లారు.
అందరూ అక్కడకు వెళ్లాలి
అలాగే కోహ్లీ కూడా కేరళలో తన సతీమణి అనుష్క శర్మతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. కేరళ అద్భుతమైన ప్రదేశమని.. అందరూ కేరళను సందర్శించాలని కోరాడు. కేరళలో ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఇక్కడకు రావడాన్ని చాలా ఇష్టపడతాను. ఈ ప్రదేశంలో ఉండే శక్తిని నేను ప్రేమిస్తున్నాను. కేరళ అందం అనుభవించాల్సిందే. ప్రజలందరూ ఏదో ఒక సమయంలో ఇక్కడకు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడకు వచ్చిన ప్రతిసారి నన్ను సంతోష పెట్టినందుకు ఈ అద్భుతమైన ప్రదేశానికి కృతజ్ఞతలు. అని కోహ్లీ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
జరిగిన ఒక్క మ్యాచ్ లో భారత్ గెలుపు
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఇప్పటివరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్- టీమిండియా మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో విండీస్ పై భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఒకే ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు టీమిండియాకు ఈ మైదానంలో తన రికార్డును మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చింది. మూడో వన్డేలో శ్రీలంకపై గెలిచి క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ దక్కించుకుంది.
భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ.
శ్రీలంక జట్టు (అంచనా)
పాతుమ్ నిశ్సాంక, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్.
View this post on Instagram