IND Vs NZ, 2nd T20I: SKY సెంచరీ, యువ ఆటగాళ్ల జోరు- కివీస్ పై భారత్ ఘనవిజయం
IND Vs NZ, 2nd T20I: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 టీమిండియా ఘన విజయం సాధించింది. కుర్రాళ్లు సమష్టిగా రాణించిన వేళ 65 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది.
IND Vs NZ, 2nd T20I: 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ను భువనేశ్వర్ తన పదునైన బౌలింగ్ తో కట్టడి చేశాడు. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ (0) ను ఔట్ చేశాడు. భువీకి తోడు సిరాజ్ కట్టుదిట్టంగా బంతులేయటంతో న్యూజిలాండ్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. పవర్ ప్లే ముగిసే సరికి 32 పరుగులు చేసింది.
కివీస్ కట్టడి
డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాన్వే (25) ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చటంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (6 బంతుల్లో 12) ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి ప్రమాదకరంగా కనిపించాడు. అయితే అతడిని చాహల్ ఒక తెలివైన బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కివీస్ బ్యాట్స్ మెన్ ఎవరూ నిలవలేదు. డారిల్ మిచెల్ (10), జిమ్మీ నీషమ్ (0), మిచెల్ శాంట్నర్(2) త్వరత్వరగా ఔటయ్యారు. ఒక ఎండ్ లో విలియమ్సన్ (52 బంతుల్లో 61) కుదురుకున్నప్పటికీ నిదానంగా ఆడాడు. అతనికి సహకరించేవారు లేక కివీస్ ఓటమి పాలయ్యింది. చివరికి 126 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టగా... భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సూర్య వీరవిహారం
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగటంతో నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (36)రాణించాడు
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ను రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ ప్రారంభించారు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడడంతో పవర్ ప్లే లో ఆశించిన మేర పరుగులు రాలేదు. ఓపెనర్ గా ప్రమోషన్ అందుకున్న పంత్ (13 బంతుల్లో 6 పరుగులు) మరీ నెమ్మదిగా ఆడి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఇషాన్ (36) అడపా దడపా బౌండరీలు కొట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంత్ వికెట్ కోల్పోయిన భారత్ 42 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (13) ఒక సిక్స్ ఒక ఫోర్ బాది టచ్ లో కనిపించినప్పటికీ దురదృష్టవశాత్తూ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత అంతా సూర్య బాదుడే.
బాదుడే బాదుడు
ఈ ఏడాదిలోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలో ఆచితూడి ఆడి తర్వాత దూకుడు పెంచాడు. 32 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న సూర్య.. తర్వాతి 50 చేయడానికి 17 బంతులు మాత్రమే తీసుకున్నాడంటే అతని బాదుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత సూర్య దూకుడు మరింతగా పెరిగింది. ఎడాపెడా సిక్స్‌లు, బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సౌథీ వేసిన 17 ఓవర్లలో సూర్య రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో.. ఆ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన సూర్య 18 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి 22 పరుగులు రాబట్టిన సూర్య అదే ఊపులో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి భారత్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
సౌథీ హ్యాట్రిక్
టిమ సౌథీ వేసిన చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు 4 పరుగులు తీసిన హార్దిక్ పాండ్య (13) మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. తర్వాతి బంతుల్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లను పెవిలియన్‌కు పంపిన సౌథీ టీ20ల్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ ఓవర్లో 5 పరుగులే వచ్చినప్పటికీ.. చివరి ఐదు ఓవర్లలో భారత్ 72 పరుగులు చేయడం గమనార్హం. కివీస్ బౌలర్లలో సౌథీకి 3 వికెట్లు దక్కగా.. ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు తీశాడు. ఇష్ సోధీ ఒక వికెట్ పడగొట్టాడు.
India take a 1-0 lead in the T20I series with a convincing win at the Bay Oval 🙌
— ICC (@ICC) November 20, 2022
Watch the #NZvIND series live on https://t.co/MHHfZPyHf9 (in select regions) 📺 pic.twitter.com/VZLav2DFQh