IND vs ENG 2nd Test: చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా! గిల్ సేనను టెన్షన్ పెడుతున్న వెదర్ రిపోర్ట్
Shubman Gill | భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్ చివరి రోజు ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ఓవర్లు ఆట సాధ్యం కాకపోవచ్చు. వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

IND vs ENG 2nd Test Updates: టీమిండియా సరికొంత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. బర్మింగ్ హాంలోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా నెగ్గలేదు. నేడు టెస్ట్ మ్యాచ్ నెగ్గితే కనుక శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ చరిత్రలో నిలిచిపోతుంది. టీమ్ ఇండియా ఈరోజు 7 వికెట్లు తీస్తే ఈ స్టేడియంలో తొలి విజయాన్ని అందించిన కెప్టెన్‌గా గిల్ నిలవనున్నాడు. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ లతో పాటు జడేజా, వాషింగ్టన్ సుందర్ రాణిస్తే రెండో టెస్టులో అలవోకగా విజయం సాధించవచ్చు. కానీ ఎడ్జ్‌బాస్టన్ వాతావరణం టీమిండియాను టెన్షన్ పెడుతోంది.
భారత క్రికెట్ జట్టు ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పటివరకూ జరిగిన 8 మ్యాచ్‌లలో 7 సార్లు టీమ్ ఇండియా ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ నేడు శుభ్‌మన్ గిల్ సేన చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. టెస్టు చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ గెలవడానికి 536 పరుగులు చేయాలి, ఇది కచ్చితంగా అసాధ్యం. ఇంగ్లాండ్ పోరాటం చేస్తే కనుక టెస్ట్ మ్యాచ్ రద్దు చేసుకునే ఛాన్స్ ఉంది.
భారత్ విజయానికి 7 వికెట్లు కావాలి, 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 72 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లేకున్నా మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అద్భుతంగా రాణించారు. ప్రసిద్ కృష్ణ నిరాశపరిచినా వీరు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. కానీ ప్రతికూల వాతావరణం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
ఎడ్జ్‌బాస్టన్‌లో నేటి వాతావరణం
ఆదివారం నాడు ఎడ్జ్‌బాస్టన్‌లో వర్షం పడే అవకాశం ఉంది, మొదటి సెషన్‌లో 40 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇది ఇంగ్లండ్‌కు కలిసొస్తుంది. వర్షం కారణంగా ఒక సెషన్ మ్యాచ్ జరగకపోతే ఇంగ్లండ్‌కు ఉపశమనం లభిస్తుంది. వారు మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి చూస్తారు. రెండో, మూడో సెషన్‌లలో కూడా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దాంతో తక్కువ ఓవర్లు మ్యాచ్ జరగడానికి అవకాశాలున్నాయి. దాంతో ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడం కష్టతరమవుతుంది.
వాస్తవానికి ఎడ్జ్‌బాస్టన్‌లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్‌లకు కలిసొస్తుంది. గాలి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దాంతో బంతి బాగా స్వింగ్ అవుతుంది. రెండు సెషన్లు సరిగ్గా జరిగినా స్వింగ్ కు అనుకూలిస్తే వారు 7 వికెట్లు సులభంగా తీయగలరు.
ఒకే టెస్టులో అత్యధిక పరుగులు
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది, శుభ్‌మన్ గిల్ 269 పరుగులు చేశాడు. ఆకాష్ దీప్ (4 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (6 వికెట్లు) బౌలింగ్‌తో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 రన్స్ మాత్రమే చేయగలిగింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది, శుభ్‌మన్ గిల్ మరో శతకం ( 161 పరుగులు) చేసి చరిత్ర సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో గిల్ మొత్తం 430 పరుగులు చేశాడు. ప్రపంచంలో ఒక టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్, భారతదేశంలో మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ప్రారంభం చాలా పేలవంగా ఉంది, బెన్ డకెట్ (25), కీలకమైన జో రూట్ (6)లను ఆకాష్ దీప్ ఔట్ చేశాడు. జాక్ క్రాలీ (0)ని సిరాజ్ డకౌట్ చేశాడు. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 72/3తో ఉంది.





















