WTC final: ఆసీస్- దక్షిణాఫ్రికా మూడో టెస్ట్ డ్రా- ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు పోరు
WTC final: 2021- 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో ఇంకా 3 సిరీస్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే ఇప్పటికీ ఫైనల్ చేరే రెండు జట్లు ఏవో అధికారికంగా ఖరారు కాలేదు.
WTC final: 2021- 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో ఇంకా 3 సిరీస్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే ఇప్పటికీ ఫైనల్ చేరే రెండు జట్లు ఏవో అధికారికంగా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియా, భారత్ లు పాయింట్ల పట్టికలో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఫైనల్ కు గట్టి పోటీదారుగా మారింది.
దక్షిణాఫ్రికాతో 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో గెలుచుకున్న ఆసీస్ ఫైనల్ చేరడం దాదాపు ఖాయమే. అయితే ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రొటీస్ తో మూడో మ్యాచ్ డ్రా అవడం వలన ఆసీస్ ఫైనల్ స్థానం హోల్డ్ లో పడింది. ఒకవేళ దక్షిణాఫ్రికాతో మూడో టెస్టును కూడా గెలిచి ఉంటే ఆసీస్ ఇప్పటికే అధికారికంగా ఫైనల్ చేరేది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే భారత్ తో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 4 మ్యాచ్ ల సిరీస్ వరకు వేచి ఉండాల్సిందే.
ఆస్ట్రేలియా ఫైనల్ కు దారిది
ఇతర జట్లపై ఆధారపడకుండా ఆస్ట్రేలియా ఫైనల్ చేరాలంటే భారత్ తో జరిగే సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచినా సరిపోతుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా.. ఎటువంటి పెనాల్టీ పాయింట్లు ఇవ్వకపోతే ఆసీస్ ఫైనల్ కు చేరుకుంటుంది.
భారత్ ఫైనల్ కు చేరాలంటే
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1 లేదా
3-0తో గెలుచుకోవాలి. ఇలా అయితే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండో సారి ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఈ ట్రోఫీలో ఘోరంగా ఓడిపోతే మాత్రం టీమిండియా ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి. 2-1 తేడాతో సిరీస్ కోల్పోయినా భారత్ కు ఫైనల్ అవకాశం ఉంటుంది. అయితే దానికి ఇతర జట్ల ఫలితాలు అవసరమవుతాయి.
శ్రీలంకకు ఛాన్స్ ఉందా!
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఫైనల్ కు గట్టి పోటీదారుగా మారే అవకాశం ఉంది. న్యూజిలాండ్ తో ఆ జట్టుకు 2 మ్యాచ్ ల సిరీస్ ఉంది. ఒకవేళ ఆ సిరీస్ ను 2-0తో గెలిస్తే లంక ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే ఇందుకు భారత్- ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓటమి పాలవ్వాలి. అదే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచినా, లేదా డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
దక్షిణాఫ్రికా మాటేంటి!
ఆస్ట్రేలియాలో 2-0తో ఓటమి దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసింది, అయితే సిడ్నీలో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకోవడం వారికి ప్లస్ గా మారింది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 48.72%తో 4వ స్థానంలో ఉంది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే 2 టెస్టులను గెలిస్తే ఆ జట్టు పాయింట్ల శాతం 55.56 కు చేరుకంటుంది. ఆ రెండు మ్యాచులు గెలిచినా ప్రొటీస్ ఫైనల్ బెర్తు ఇతర జట్ల ఫలితాల మీదే ఆధారపడి ఉంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (75.56) విజయాల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. భారత్ (58.93) శాతంతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. శ్రీలంక (53.93), దక్షిణాఫ్రికా (48.72) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ సమీకరణాల ప్రకారం ఆసీస్, భారత్ మధ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Which two teams will play the WTC final? 🏏#WTC2023 #INDvAUS pic.twitter.com/0dUBcGRSUw
— 100MB (@100MasterBlastr) January 9, 2023