(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS Final: టాస్ గెలిస్తే బ్యాటింగా, బౌలింగా? అసలు పిచ్ ఎలా ఉంటుందంటే..?
Narendra Modi Stadium Pitch : పుష్కర కాలం తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
IND vs AUS World Cup 2023 Final: ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన... మరోసారి స్థాయికితగ్గ ప్రదర్శన చేస్తే కంగారులను కళ్లెం వేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే ఇదే గుజరాత్‌లోని అహ్మదాబాద్ పిచ్‌పై ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లో కంగారులను మట్టికరిపించిన రోహిత్ సేన మరోసారి ఆ ఫలితాన్నే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే వాంఖడేలో తాజా పిచ్ వినియోగించకుండా ఆడిన పిచ్‌పైనే సెమీస్ నిర్వహించడంపై విమర్శలు వచ్చిన వేళ... ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చలూ ఊపందుకున్నాయి. అహ్మదాబాద్ పిచ్‌ను పరిశీలించిన తర్వాత అది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా... బౌలింగ్‌కు అనుకూలిస్తుందా టాస్ గెలిస్తే ఏం తీసుకుంటే మంచిదనే దానిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోని మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. అయిదు పిచ్‌లను నల్లమట్టితో తయారు చేయగా... మిగిలిన ఆరు పిచ్‌లను ఎర్రమట్టితో తయారు చేశారు. ఫైనల్‌కు ఎంపిక చేసే పిచ్‌ను బట్టి అది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా... బౌలింగ్‌కు అనుకూలిస్తుందా అన్న దానిపై ఒక నిర్ణయానికి రావచ్చు. ఒకవేళ నల్లమట్టి పిచ్‌ను ఫైనల్‌కు ఎంపిక చేస్తే దానిపై కొంచెం బౌన్స్ లభించే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాదని ఎర్రమట్టితో కూడిన పిచ్‌ను ఎంపిక చేస్తే బాల్ చాలా నెమ్మదిగా బ్యాట్‌పైకి వస్తుంది. ఇది బ్యాటర్లకు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ ఫైనల్ లాంటి మెగా ఈవెంట్‌లకు నల్లమట్టి పిచ్‌నే ఎంపిక చేస్తారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. స్పిన్‌కు అనుకూలించే వికెట్ సిద్ధం చేయనున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి. వికెట్ కనుక స్పిన్‌కు అనుకూలిస్తే టీమిండియాది ఒకింత పైచేయి కానుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీ్‌సలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఆసిస్‌లో బలమైన స్పిన్నర్లు లేకపోవడం టీమిండియాకు బలంగా మారనుంది.
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకైతే అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించింది. ఈ వరల్డ్‌కప్‌లోఅహ్మదాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఈ నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అలాగే నాలుగు మ్యాచ్‌ల్లో ఏ జట్టూ 300 రన్స్ చేయలేదు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా చేసిన 286 పరుగులే ఈ టోర్నీలో ఇక్కడ అత్యధిక స్కోరు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట 282 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ పాకిస్థాన్‌ను మొదట 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఛేదనలో మూడు వికెట్లే కోల్పోయి 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది.
ఇక్కడ పేసర్లకు పిచ్ బాగా సహకరించింది. నాలుగు మ్యాచుల్లో మొత్తం 57 వికెట్లు నేలకూలగా ఇందులో 36 వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే దక్కాయి. కేవలం 21 వికెట్లు మాత్రమే స్పిన్నర్లకు దక్కాయి. ఫైనల్ కోసం తాజా పిచ్‌ను సిద్ధం చేస్తారా.. లేదా ఉపయోగించిన పిచ్‌నే వాడతారా అన్నదానిపై స్పష్టత లేదు. అహ్మదాబాద్ పిచ్‌పై ఛేదన కష్టమని.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ముఖ్యమని ఓ క్యూరేటర్ తెలిపాడు.