ICC Champions Trophy 2025: మెగాటోర్నీకి తొలిసారి ఐదుగురు స్పిన్నర్లు.. టీమ్ మేనేజ్మెంట్ సరికొత్త బెట్.. నాకౌట్ అవకాశాలు వారి చేతుల్లోనే..
ఎన్నడూ లేని విధంగా జట్టులో ఐదుగురు స్పిన్నర్లు కుల్దీప్ , వరుణ్ చక్రవర్తి, అక్షర్ , వాషింగ్టన్ సుందర్, జడేజా ఉన్నారు. ఈసారి టోర్నీలో భారత్ ముందడుగు వేయాలంటే స్పిన్నర్లు రాణించాల్సిందే.

Team Indi News: ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ స్పిన్ బలగంతో సిద్ధమైంది. ఎన్నడూ లేని విధంగా జట్టులో ఐదుగురు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా రూపంలో అందుబాటులో ఉన్నారు. ఈసారి టోర్నీలో భారత్ ముందడుగు వేయాలంటే స్పిన్నర్లు అంచనాలను అందుకోవాలిసిందే. మెగాటోర్నీ పాకిస్థాన్ లో జరుగుతున్నప్పటికీ, భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. అయితే దుబాయ్ పిచ్ స్పిన్ కు మరీ అంతగా సహకరించక పోయినా ఓ మోస్తరుగా యూజ్ అవుతాయి.
ఇటీవలే ఐఎల్ టీ20 టోర్నీ జరగడంతో పిచ్ కాస్త స్పిన్ కు అనుకూలించే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మూడు లీగ్ మ్యాచ్ లతో పాటు అన్నీ అనుకున్నట్లు జరిగితే సెమీస్, ఫైనల్ లాంటి మరో రెండు నాకౌట్ మ్యాచ్ లు ఇక్కడ జరిగే అవకాశముంది. ఈ పిచ్ ను అంచనా వేసే ఐదుగురు స్పిన్నర్లను స్క్వాడ్ లోకి తీసుకున్నారని తెలుస్తోంది.
గంభీర్ ప్రణాళికలే...
హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాక, వీలైనంత ఎక్కువ మంది ఆల్ రౌండర్లను తుది జట్టులో ఆడించేందుకే గౌతం గంభీర్ మొగ్గు చూపుతున్నాడు. తాను బాధ్యతలు స్వీకరించిన కొత్తలో స్పెషలిస్టు బ్యాటర్లను కూడా బౌలింగ్ నేర్చుకోమని సూచించాడు. తాజాగా ఎదురైన ఓటముల నేపథ్యంలో తన దూకుడు కాస్త తగ్గింది. అయితే జట్టులో ఆల్ రౌండర్లు ఉండాలనే తన విధానానికే సై అంటున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ భారత్ కు అనేక ప్రయోజనాలు ఆల్ రౌండర్ల వల్ల సిద్ధిస్తాయి. డీప్ బ్యాటింగ్ లైనప్ తోపాటు ఆనేక బౌలింగ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన రెండు వైట్ బాల్ సిరీస్ ల్లోనూ మనం ఈ తేడాను గమనించవచ్చు. సీమ్ ఆల్ రౌండర్ల కొరత ఉండటంతోనే స్పిన్ ఆల్ రౌండర్ల వైపు గంభీర మొగ్గు చూపాడని తెలుస్తోంది. నిజానికి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ కేటగిరీలో సీమ్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను కూడా రెడీ చేసినట్లు సమాచారం.
అనుభవం లేని పేస్ అటాక్..
తురుపు ముక్క జస్ ప్రీత్ బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడం, గాయం నుంచి కోలుకున్న మహ్మద్ షమీ అంతగా ప్రభావం చూపించకపోవడంతో కొత్త పేసర్లు హర్షిత్ రానా, అర్షదీప్ లను కూడా స్క్వాడ్ లోకి తీసుకున్నారు. ఒకవేళ షమీ గాయం తిరగబెడితే వీరిద్దరే పేస్ భారాన్ని మోయాలి. దీంతో అనుభవజ్క్షులైన స్పిన్నర్లకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. పిచ్, ప్రత్యర్థిని బట్టి ఇద్దరు ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు వరుణ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. వీరితోపాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తుదిజట్టులో చోటు ఖాయమని చెప్పవచ్చు. న్యూజిలాండ్ వంటి జట్టుపై వాషింగ్టన్ సుందర్ ఎఫెక్టివ్ గా పని చేస్తాడు. ఇలా పలు ప్రత్యమ్నాయాలను టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. ఇక దుబాయ్ లో పిచ్ పొడి బారి క్రాక్స్ రాకుండా గడ్డితో కప్పి ఉంచడంతో స్పిన్నర్లకు ఏ మేరకు సహకరిస్తుందోనని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా టీమిండియా నాకౌట్ చేరుకోవడం స్పిన్నర్లపైనే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు.
Read Also: RCB 2025 News: అందుకే శ్రేయస్, పంత్, రాహుల్ ను పర్చేజ్ చేయలేదు.. ఆర్సీబీ యాజమాన్యం స్ఫష్టత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

