Virat Kohli: విరాట్ రన్ మెషిన్, నేడు కింగ్ కోహ్లీ జన్మదినం
Happy Birthday Virat Kohli: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఫార్మాట్ ఏదైనా... జనరేషన్ ఏదైనా... దిగ్గజాల క్రికెటర్ల జాబితా తీస్తే.. అందులో విరాట్ కోహ్లి పేరు ఉండాల్సిందే.
విరాట్ కోహ్లి.. టీమిండియా రన్‌మెషిన్... నేటి కాలంలో ప్రతి బౌలర్‌కు వణుకు పుట్టించే పేరు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఫార్మాట్ ఏదైనా... జనరేషన్ ఏదైనా... దిగ్గజాల క్రికెటర్ల జాబితా తీస్తే.. అందులో విరాట్ కోహ్లి పేరు ఉండాల్సిందే. కింగ్ కోహ్లీ మైదానంలో బరిలోకి దిగితే పరుగుల ప్రవాహమే. లక్ష్య ఛేదనలో అతణ్ని మించిన బ్యాటర్.. అతనిలా రాణించిన క్రికెటర్ లేడు. సచిన్ తర్వాత అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్.. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. పిన్నవయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ ప్లేయర్.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు (నవంబర్ 5 ) కింగ్ కోహ్లీ పుట్టిన రోజు. ఆయన అభిమానులకు ఇది పండుగ రోజు. ఆల్ టైం గ్రేట్ క్రికెటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన కోహ్లీ సచిన్ వన్డే శతకాల రికార్డును బద్దలు కొట్టేందుకు కాస్త దూరంలోనే ఉన్నాడు.
ఒత్తిడి పరిస్థితుల్లో లక్ష్య చేధనలో కోహ్లీలా మరే క్రికెటర్ ఆడలేడంటే అతిశయోక్తి కాదు. 1988 నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో కోహ్లి జన్మించాడు. మూడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన కోహ్లీ.... ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక ఏడాది వెయ్యి పరుగులు అత్యధిక సార్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. సచిన్ ఒక ఏడాది వెయ్యి పరుగులు మొత్తం 7 సార్లు చేయగా.. విరాట్ కోహ్లీ 8 సార్లు చేసి టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు. 22 ఏళ్ల కంటే ముందు వన్డేల్లో రెండు శతకాలు చేసిన మూడో బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో పాకిస్థాన్‌పై వ్యక్తిగత అత్యధిక స్కోరు విరాట్ పేరుపైనే ఉంది. 2012 ఆసియా కప్‌లో విరాట్ 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. 2012లో 23 ఏళ్లకే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం సొంతం చేసుకున్నాడు. వేగంగా1000, 2000, 3000, 4000, 5000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. వేగంగా ఏడు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గానూ విరాట్ చరిత్ర సృష్టించాడు.
మూడేళ్ల వయసులో బ్యాట్ పట్టిన కోహ్లి.. ఆ బ్యాట్‌తోనే ప్రపంచానికి తనేంటో చాటాడు. ఈ స్థాయిలో సక్సెస్‌ను సాధించే క్రమంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం విరాట్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే తండ్రి మరణించిన రోజే.. క్రికెటర్‌గా తాను అత్యున్నత లక్ష్యాలను చేరుకోవాలని కోహ్లి నిశ్చయించుకున్నాడు. ఈ ప్రపంచం నన్ను గుర్తించాలంటే నేను అసాధారణంగా ఆడాలి. నా శ్రమ, కష్టంతోనే ఇది సాధించాలి. తన చర్యల ద్వారా మా నాన్న నాకు సరైన మార్గం చూపించారు. ఆ చిన్న విషయాలే నా మీద గొప్ప ప్రభావం చూపాయి’ అని గతంలో భారత ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో తన అనుభవాలను కోహ్లీ పంచుకున్నాడు.
పుట్టిన రోజు జరుపుకొనే వాళ్లకు ఇతరులు కానుక ఇస్తారు. కానీ నేడు తన 35వ పుట్టిన రోజు చేసుకోనున్న విరాట్.. తనకు తాను ఓ మంచి కానుక ఇచ్చుకోవడమే కాక, తమనూ సంబరాల్లో ముంచెత్తుతాడనే ఆశతో ఉన్నారు అభిమానులు. తన పుట్టిన రోజు నాడే ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడబోతున్నాడు విరాట్. వన్డేల్లో కోహ్లి తన తొలి శతకాన్ని అందుకున్నది ఈడెన్‌లోనే కావడం విశేషం. ఇక్కడ అతడికి మంచి రికార్డుంది. సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే శతకాల రికార్డు (49)కి ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడతను. దక్షిణాఫ్రికాపై మూడంకెల స్కోరు అందుకుని ఈడెన్‌ను సంబరాల్లో ముంచెత్తుతాడేమో చూడాలి.