Ravindra Jadeja: వన్డేలలో జబర్దస్త్ రికార్డు సొంతం చేసుకున్న జడ్డూ - కపిల్‌దేవ్ తర్వాత అతడే
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Ravindra Jadeja: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేలలో 200 వికెట్లు తీసి 2 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు భారత స్టార్ ఆల్ రౌండర్, ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తొలిసారథి కపిల్ దేవ్ పేరిట ఉండేంది. ఆసియా కప్ - 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో జడేజా ఈ ఘనత సాధించాడు.
కపిల్ దేవ్ భారత్ తరఫున 225 వన్డేలు ఆడి 253 వికెట్లు తీయడమే గాక 3,783 పరుగులు సాధించాడు. టీమిండియా నుంచి 250 ప్లస్ వికెట్లు తీసిన తొలి బౌలర్ అతడే.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ 200 వికెట్లు తీయడానికి 165 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి.
కాగా జడేజా 174 వన్డేలలో 200 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్ విషాయానికొస్తే జడ్డూ.. 124 ఇన్నింగ్స్‌లలో 2,585 పరుగులు చేశాడు. భారత్ తరఫున 200 ప్లస్ వికెట్లు తీసిన ఏడో బౌలర్ జడ్డూ. వన్డేలలో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఘనత అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే తన కెరీర్‌లో 337 వికెట్లు తీశాడు. ఆ తర్వాత జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (282), హర్భజన్ సింగ్ (269), కపిల్ దేవ్ (253) లు జడేజా కంటే ముందున్నారు.
Ravindra Jadeja became the 2nd Indian after Kapil Dev to have 2000 runs & 200 wickets in ODI.
— Johns. (@CricCrazyJohns) September 15, 2023
- Jadeja created history....!!!!!! pic.twitter.com/GUVFGIkTlF
అంతర్జాతీయంగా చూస్తే కనీసం రెండు వేల పరుగులు చేసి 200 ప్లస్ వికెట్లు తీసిన ఆటగాళ్లలో శ్రీలంక ఆల్ రౌండర్ సనత్ జయసూర్య అగ్రస్థానాన ఉన్నాడు. జయసూర్య 445 మ్యాచ్‌లలో 13,430 పరుగులు, 323 వికెట్లు తీశాడు. ఆ తర్వాత జాక్వస్ కలిస్ (11,579 రన్స్, 273 వికెట్లు), షాహిద్ అఫ్రిది (8,064 రన్స్, 395 వికెట్లు), అబ్దుల్ రజాక్ (5,080 రన్స్, 269 వికెట్లు), క్రిస్ కెయిన్స్ (4,950 రన్స్, 201 వికెట్లు), కపిల్ దేవ్ (3,783 రన్స్, 253 వికెట్లు), వసీం అక్రమ్ (3,717 రన్స్ , 502 వికెట్లు), హిత్ స్ట్రీక్ (2,943 రన్స్, 393 వికెట్లు) లు జడేజా కంటే ముందు స్థానాన నిలిచారు.
భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భాగంగా బంగ్లా బ్యాటర్ షమీమ్ హోసెన్ (1) ను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ రికార్డును నెలకొల్పాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (80) తో పాటు తౌహిద్ హృదయ్ (54), నసుమ్ అహ్మద్ (44) లు రాణించారు. అనంతరం భారత్ ఛేదనలో తడబడింది. రోహిత్ శర్మ డకౌట్ కాగా శుభ్‌మన్ గిల్ (121) సెంచరీతో కదం తొక్కాడు. కానీ భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి విజయం ముందు బోల్తా కొట్టింది. ఆఖర్లో అక్షర్ పటేల్ (42) గెలిపించే యత్నం చేసినా అతడు కూడా 49వ ఓవర్లో నిష్క్రమించడంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. 12 ఏండ్ల తర్వాత ఆసియా కప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial