Asia Cup 2023: ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు! - త్వరలోనే షెడ్యూల్ విడుదల
ఆసియా కప్ - 2023 షెడ్యూల్ ప్రకారమే జరుగనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానున్నట్టు సమాచారం.
Asia Cup 2023: గడిచిన ఏడెనిమిది నెలలుగా చర్చోపచర్చలు సాగుతున్న ఆసియా కప్ - 2023 ఎట్టకేలకు షెడ్యూల్ ప్రకారమే జరుగనుంది. అన్నీ కుదిరితే ఈ నెల 14 (శుక్రవారం)న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ అరున్ ధుమాల్ కీలక విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీట్ (సీఈసీ) నిమిత్తం డర్బన్ (దక్షిణాఫ్రికా)లో ఉన్న ధుమాల్.. ఆసియా కప్ షెడ్యూల్, ఇండియా - పాక్ మ్యాచ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ - పాక్ మ్యాచ్, ఆసియా కప్ షెడ్యూల్ తదితర విషయాలపై ధుమాల్ మాట్లాడాడు.
ధుమాల్ స్పందిస్తూ.. ‘మా సెక్రటరీ (జై షా) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెడ్ జకా అష్రఫ్‌తో సమావేశమయ్యాడు. వాళ్లిద్దరి మధ్య ఆసియా కప్ షెడ్యూల్ గురించే చర్చ జరిగింది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ మేరకే ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగుతాయి. ఫైనల్ కూడా లంకలోనే జరుగుతుంది..’ అని తెలిపాడు.
అవన్నీ ఫేక్ న్యూస్..
వన్డే వరల్డ్ కప్ పై పాకిస్తాన్ క్రీడా మంత్రి ఎహ్సాన్ మజారీ చేసిన వ్యాఖ్యలతో పాటు త్వరలోనే భారత జట్టు పాకిస్తాన్ లో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని.. ఈ మేరకు జై షా ముందు పాక్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించిన తర్వాత టీమిండియా కూడా వెళ్లనుందని వస్తున్న వార్తలపై ధుమాల్ స్పందించాడు. అవన్నీ వదంతులేనని అన్నాడు. ‘అసలు అలాంటి చర్చే లేదు. భారత్ గానీ మా సెక్రటరీ గానీ పాకిస్తాన్ వెళ్లడం లేదు. ఈ భేటీలో ఆసియా కప్ గురించి మాత్రమే చర్చ జరిగింది..’ అని స్పష్టం చేశాడు.
Major points after the meeting by PCB Head & Jay Shah. [PTI]
— Johns. (@CricCrazyJohns) July 12, 2023
- Asia Cup schedule is finalized.
- Hybrid model to stay.
- 9 matches in SL & 4 matches in PAK.
- India vs Pakistan in SL.
- Schedule will be announced soon. pic.twitter.com/b1H9bNUWnY
2016 తర్వాత ఉపఖండంలో జరుగబోయే తొలి ఆసియా కప్ ఇదే కావడం గమనార్హం. ఆసియా కప్ చివరిసారి 2016లో బంగ్లాదేశ్‌లో జరిగింది. ఆ తర్వాత రెండు ఎడిషన్స్ యూఏఈలోనే జరిగాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భాగంగా.. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో పాక్ ఆడేది ఒకటే మ్యాచ్. అది కూడా నేపాల్‌తో.. మిగిలిన మూడు మ్యాచ్‌లు అఫ్గానిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్ తలపడతాయి. ఈ నాలుగు మ్యాచ్‌లు ముగిశాక టోర్నీ మొత్తం శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. భారత్ - పాక్ మ్యాచ్‌లకు శ్రీలంకలోని దంబుల్లా స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశాలున్నాయి. భారత్ - పాక్ లు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటే 15 రోజుల వ్యవధిలో ఇరు జట్లూ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.
ఇదివరకే ప్రకటించిన దాని ప్రకారం.. ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 దాకా జరగాల్సి ఉంది. శుక్రవారం తుది షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తున్నది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial