India Opener Dilemma: మ్యూజికల్ చైర్స్లా మారిన ఓపెనర్ల ఎంపిక.. వైభవ్ కి బదులుగా సంజూ శాంసన్‌కు వైపే మొగ్గిన మాజీ క్రికెటర్
టీ20ల్లో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న వేళ వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజూ శాంసన్‌కే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అజింక్యా రహానే సూచించాడు.

Rahane Wants Samson In India Top Three: టీమ్ ఇండియా టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం జరుగుతున్న పోటీ చాలా కాలంగా మ్యూజికల్ చైర్స్ ఆటలా మారిందని విశ్లేషకులు అంటున్నారు.. అభిషేక్ శర్మ తన స్థానాన్ని స్థిరపరుచుకోగా, మొదట్లో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పోటీలోకి వచ్చి మూడో స్థానానికి చేరాడు. అనంతరం 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకతో మరోసారి సంజూ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో అరంగేట్రం చేసిన సిరీస్‌లో వైభవ్ 14, 13, 15 స్కోర్లతో తడబడినప్పుడు సంజూకు మరో అవకాశం దక్కింది, ఆ తర్వాత అతడు కూడా జట్టుకు దూరమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనలో వైభవ్ అద్భుతంగా పుంజుకుని మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సొంతం దక్కించుకున్నాడు.
సంజూకే ప్రాధాన్యం..
భారత మాజీ బ్యాటర్ అజింక్యా రహానే ఈ అంశంపై స్పందిస్తూ జట్టు యాజమాన్యం సంజూ శాంసన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన రహానే, "వరల్డ్ కప్ ఆడిన టాప్ త్రీ బ్యాటర్లే ఇప్పటికీ కొనసాగాలని నేను భావిస్తున్నా. సంజూ అద్భుతంగా రాణించినప్పటికీ రెండు మూడు ఇన్నింగ్స్‌లు విఫలం కాగానే అతడిని పక్కన పెట్టారు. అతడికి మరో అవకాశం ఇవ్వాలి. అభిషేక్, ఇషాన్ కూడా చాలా బాగా ఆడారు. వైభవ్‌కు భవిష్యత్తులో పుష్కలంగా అవకాశాలు వస్తాయి, అతడి సమయం ఇంకా ఉంది. ప్రస్తుతానికైతే వరల్డ్ కప్‌లో సత్తా చాటిన సంజూ, అభిషేక్, ఇషాన్లే టాప్ త్రీలో ఉండాలి" అని తెలిపాడు.
శాంసన్ రీ ఎంట్రీపై ఖుషి..
అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను తిరిగి ఎంపిక చేయడంపై రహానే హేపీగా ఫీలయ్యాడు.. ఈ ఏడాది మొదట్లో భారత్ గెలిచిన టీ20 వరల్డ్ కప్‌లో సంజూ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడనే విషయాన్ని గుర్తుచేశాడు. "సంజూ జట్టులోకి తిరిగి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వరల్డ్ కప్‌లో అతడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచాడు. అతడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజంగా మారాయి, అతడి నియంత్రణలో లేని విషయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ అతడొక తిరుగులేని మ్యాచ్ విన్నర్, అతడి రాకతో జట్టు మరింత పటిష్టంగా మారుతుంది" అని రహానే పేర్కొన్నాడు.
ఓపెనర్ గా చాన్స్ దక్కుతుందా..?
అఫ్గానిస్తాన్‌తో జరిగే పోరులో సంజూకు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాప్ ఆర్డర్లో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలని నిపుణులు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















