World Cup 2023: పెద్ద మనసు చాటుకున్నఆఫ్ఘన్ వికెట్ కీపర్, రోడ్లపై నిద్రిస్తున్న వారికి డబ్బులు పంచిన గుర్బాజ్
Rahmanullah Gurbaz : గూడు లేని నిరాశ్రయులను చూసి చలించిన అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెరన్ రెహ్మనుల్లా గుర్బాజ్ తన మంచి మనసు చాటుకున్నాడు.
ఈ ప్రపంచ కప్ లో అఫ్గాన్ క్రికెటర్లు తమ సత్తా చూపారు. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. అద్భుత ప్రదర్శన చేసింది అబ్బురపరిచింది. మైదానంలో తన సత్తా చూపిన అఫ్గాన్ క్రికెటర్లు బయట తమ మంచి మనసును చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ గూడు లేని నిరాశ్రయులను చూసి చలించిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అహ్మదాబాద్ వీధుల్లోకి వెళ్లిన గుర్బాజ్.. ఫుట్‌పాత్ మీద నిద్రపోతున్న వారి దగ్గరకు వెళ్లి.. రూ.500 నోట్ల వారి దగ్గర వదిలి వచ్చాడు. అది కూడా, వారు నిద్రిస్తుండగా, వారికి తెలియకుండా వారి పక్కన డబ్బు ఉంచాడు. వారు ఆ డబ్బుతో దీపావళి వేడుకలు చేసుకోవాలన్నది రహ్మనుల్లా గుర్బాజ్ కోరిక. ఈ వీడియోను కోల్‌కతా నైట్‌రైడర్స్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
'అహ్మదాబాద్‌లో రోడ్డు పక్కన పడుకునే వాళ్లకు ఇలా ప్రేమను పంచుతున్న రహ్మనుల్లా గుర్బాజ్ కెమెరా కంటికి చిక్కాడు. వరల్డ్ కప్‌లో గట్టి పోరాటం తర్వాత ఈ దేశం విడిచి పెట్టి వెళ్లే ముందు అతను ఈ పని చేయడం గమనార్హం' అని ఈ పోస్టుకు క్యాప్షన్ పెట్టిందీ ఫ్రాంచైజీ. గుర్బాజ్ మంచి మనసును నెటిజన్లు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మైదానంలో ఆటతో, బయట ఇలా మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకుంటున్న ఆఫ్ఘన్ జట్టుపై మరింత గౌరవం పెరుగుతోందని అంటున్నారు. ఇటీవల ఆఫ్గనిస్తాన్ లో జరిగిన భూకంపంలో మృతులు, బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు గుర్బాజ్ బృందం ఎంతో శ్రమించి విరాళాలు సేకరించింది.
ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను అప్గాన్ మట్టికరిపించింది. ఏదో ఒక జట్టుపై విజయం సాధిస్తే అది గాలివాటం అనుకోవచ్చు. కానీ అఫ్గాన్ జట్టు మూడు ప్రపంచ ఛాంపియన్ జట్లను చిత్తు చేసింది. అంతేనా ఆస్ట్రేలియాపై దాదాపు విజయం సాధించినంత పని చేసి కంగారులను కంగారు పెట్టింది.
మూడు ప్రపంచ ఛాంపియన్ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా... సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్ రేసులో నిలిచిందంటే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ అఫ్గాన్ బ్యాటర్ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు.
పెద్ద జట్లను చూసి భయపడి వెనక్కి తగ్గడం కాదు.. సవాలు విసిరే పోరాటంతో గెలవడం అలవాటుగా మార్చుకుంది. ఏకంగా మూడు పెద్ద జట్లపై అఫ్గాన్ విజయాలే అందుకు నిదర్శనం. ఈ విజయాలు కూడా ఏదో గాలివాటం కాదు. పూర్తి ఆధిపత్యంతో, సాధికారికంగా సాధించినవే.