Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ- భారత్ ఖాతాలో మరో పసిడి
Asian Games 2023: ఆసియా క్రీడల్లో మహిళా టీమ్ కాంపౌండ్ విభాగంలో భారత్ కు మరో పసిడి వచ్చింది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ పతాకాల వేట కొనసాగిస్తోంది. వంద పతకాలు గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. ఈ దిశగా దూసుకుపోతోంది. తాజాగా భారత క్రీడాకారులు మరో పసిడి పతాకాన్ని గెలుచుకున్నారు. ఆర్చరీ విభాగంలో మన మహిళా క్రీడాకారులు సత్తా చాటారు. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం మరోసారి మెరిసింది. తాజాగా జరిగిన ఆర్చరీ మహిళా టీమ్ కాంపౌండ్ విభాగం ఫైనల్స్ లో అదితి, పర్నీత్ కౌర్ లతో కలిసి పసిడి పతాకాన్ని సాధించింది.
230-229 స్కోరుతో చైనీస్ తైపీ మహిళా టీమ్ పై విజయం సాధించిది గోల్డ్ ను సాధించింది టీమిండియా. ఈ పసిడితో కలిపి తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో అగ్రస్థానంలో నిలిచి పసిడి గెలుచుకున్న తర్వాత, భారత్ కు గోల్డ్ మెడల్ రావడం ఇది రెండోది. ముగ్గురు ఆర్చర్ లు వ్యక్తిగత ఈవెంట్లలో ఫైనల్ కు చేరుకున్నందున వారికి మరిన్ని పతకాలు రానున్నాయి.
🎯🥇GOLDEN GIRLS🥇🎯#KheloIndiaAthletes Aditi, @VJSurekha, and @Parrneettt add another Gold to India's medal tally after defeating Chinese Taipei by a scoreline of 230-229🤩🎯
— SAI Media (@Media_SAI) October 5, 2023
What a thrilling final 💪 Our Indian Archery contingent is truly shining bright, clinching their 2nd… pic.twitter.com/NtTiqO37aY
మహిళా కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్ లో పర్నీత్ కౌర్, అదితి ఇద్దరూ 9 తో ప్రారంభించగా, జ్యోతి సురేఖ 10తో మొదలు పెట్టింది. చైనీస్ తైపీ ఆర్చర్లకు మొదటగా రెండు 10లు, ఒక 7 వచ్చింది. అనంతరం పర్నీత్-8 సాధించగా.. అదితి, జ్యోతి ఇద్దరూ 9 సాధించారు. చైనీస్ తైపీ క్రీడాకారులు మాత్రం 10, 10, 9 సాధించి రెండు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. ప్రతి ఎండ్ లో మొత్తం 6 బాణాలు ఉంటాయి. అంటే జట్టులోని ప్రతి ఒక్కరికి రెండు ఛాన్స్ లు ఉంటాయి. 60 అనేది ఒక జట్టు సాధించగలిగే గరిష్ఠ స్కోరు. సెకండ్ ఎండ్‌లో భారత క్రీడాకారులు 9, 9, 10 సాధించగా.. చైనీస్ తైపీ ప్లేయర్లు 10, 10, 10 సాధించి తమ ఆధిక్యాన్ని 4 పాయింట్లకు పెంచుకున్నారు. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్న భారత జట్టు.. చైనీస్ తైపీ క్రీడాకారులపై ఒత్తిడి పెంచి ఫైనల్ లో 230-229 తేడాతో విజయం సాధించి పసిడి గెలుచుకుంది.
అటు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్ కు ఇద్దరు భారతీయులు చేరుకున్నారు. దీంతో వారిద్దరిలో ఎవరు గెలిచినా భారత్ కు స్వర్ణం, రజతం దక్కనుంది. ఆర్చరీలో అభిషేక్ వర్మ, ఓజాస్ డియోటాలే పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు చేరుకున్నారు. ఇప్పటికే ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత్ కు మూడు పతకాలు కన్ఫర్మ్ అయిపోయాయి. వీటితో పాటు మొత్తం జట్టుగా భారత్ కు 9 పతకాల కోసం మిగతా ఆర్చర్లు పోటీలో పాల్గొననున్నారు.
ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత క్రీడాకారులు 82 పతకాలు సాధించారు. ఇందులో పసిడి-19, రజతం-31, కాంస్యం-32 ఉన్నాయి.