AFG vs NZ: కోహ్లీసేన సెమీస్ చేరాలంటే..! నలుగురు అఫ్గాన్ ఆటగాళ్లు అదరగొట్టాలి మరి!
అఫ్గానిస్థాన్ నేడు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచులో విజయం సాధించాలంటే అఫ్గాన్‌లో నలుగురు కీలక ఆటగాళ్లు రాణించాల్సిందే. అందుకే వారు బాగా ఆడాలని టీమ్‌ఇండియా, అభిమానులకూ కోరుకుంటున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం అత్యంత కీలక మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో గెలుపోటములు టీమ్‌ఇండియా సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే భారతీయులకు ఇది ముఖ్యమైన పోరు! కోహ్లీసేన సెమీస్ చేరాలంటే ఈ అఫ్గాన్ ఆటగాళ్లు రాణించక తప్పదు మరి!
రషీద్ ఖాన్
టీ20 క్రికెట్లోనే అత్యంత విలువైన ఆటగాడు రషీద్ ఖాన్. ఇండియన్ ప్రీమియర్ లీగుతో వెలుగులోకి వచ్చిన ఈ స్పిన్నర్ ప్రపంచవ్యాప్తంగా అనేక లీగులు ఆడాడు. మొత్తం 288 టీ20 మ్యాచులు ఆడి 399 వికెట్లు తీశాడు. 5/3 అత్యుత్తమ గణాంకాలు. సన్‌రైజర్స్‌కు ఆడాడు కాబట్టి కేన్ విలియమ్సన్ ఆటతీరుపై అతడికి అవగాహన ఉంది. మార్టిన్ గప్తిల్‌నూ బోల్తా కొట్టించగలడు. అంతుచిక్కని గూగ్లీలతో ఎవరినైనా ఔట్ చేయగలడు.
మహ్మద్ నబీ
ఈ అఫ్గానిస్థాన్ సారథి జట్టుకు అత్యంత కీలకం. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. అంతర్జాతీయ క్రికెట్ లీగుల్లో ఆడిన అనుభవం ఉంది. తన ఫ్లయిటెడ్ డెలివరీలతో బ్యాటర్లను అడ్డుకుంటాడు. 308 టీ20లు ఆడిన నబీ 4801 పరుగులు చేశాడు. 293 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌కే ఆడటంతో విలియమ్సన్, ఇతర కివీస్ ఆటగాళ్లపై అవగాహన ఉంది.
ముజీబుర్ రెహ్మాన్
పవర్‌ప్లేలో అత్యంత కీలక బౌలర్. తన మిస్టరీ స్పిన్‌తో మహామహులనే బోల్తా కొట్టిస్తాడు. ఈ యువ స్పిన్నర్‌కూ ఐపీఎల్, బిగ్‌బాష్, సీపీఎల్, పీఎస్‌ఎల్ ఆడిన అనుభవం ఉంది. 152 మ్యాచుల్లోనే 171 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడికి ఫిట్‌నెస్ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. ఆడితే మాత్రం కివీస్‌కూ చుక్కలు తప్పవు.
హజ్రతుల్లా జజాయ్
అఫ్గాన్ ఎక్కువ స్కోరు చేయాలన్నా.. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించాలన్నా ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కీలకం. ఈ యువ ఆటగాడు బ్యాటుతో దడదడలాడించగలడు. పవర్‌ప్లేలో నిర్భయంగా షాట్లు ఆడేస్తాడు. అతడు గనక హిట్టైతే భారీ స్కోరుకు బాటలు పడినట్టే. ఇప్పటి వరకు 69 టీ20ల్లో 29.64 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 1986 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, పది అర్ధసెంచరీలూ చేసిన అనుభవం ఉంది.