Cricket: ఇండియన్ క్రికెట్ లవర్స్‌కి ఆ 10 మందిని చూస్తే మాత్రం పిచ్చ కోపం
క్రికెట్‌ని అంతగా ప్రేమించే మన అభిమానులకి పలువురు విదేశీ క్రికెటర్లు అంటే మాత్రం ఇష్టం ఉండదు. ఇందుకు కారణాలు ఏవైనా కావొచ్చు.
భారతదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ మరే దేశంలో ఉండదు. దేశంలో ఏదైనా టోర్నీ జరుగుతంటే అభిమానులకు పండగే పండగ. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు డుమ్మా కొట్టి మరీ మ్యాచ్‌లు చూసిన రోజులు ప్రతి క్రికెట్ అభిమానికి తీపి గుర్తులు. అంతలా మనం క్రికెట్‌ని, క్రికెట్ ఆడే ఆటగాళ్లను ప్రేమిస్తాం. క్రికెట్ విషయంలో మాత్రం స్వదేశీ, విదేశీ ఆటగాళ్లన్న వ్యత్యాసం మన అభిమానులకు తక్కువే. ఇందుకు కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదేనండీ... మనం ముద్దుగా పిలుచుకునే IPL.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... క్రికెట్‌ని అంతగా ప్రేమించే మన అభిమానులకి పలువురు విదేశీ క్రికెటర్లు అంటే మాత్రం ఇష్టం ఉండదు. ఇందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. మన దేశం, క్రికెటర్లపై ఏవైనా వ్యాఖ్యలు చేయడం, వాళ్ల స్వభావం ఇలా ఏదైనా కావొచ్చు. ఇంతకీ వారెవరూ, ఎందుకు మన క్రికెట్ అభిమానులకు నచ్చరో చూద్దాం.
1. షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదిని మన క్రికెట్ అభిమానులు బాగా ట్రోల్ చేస్తుంటారు. గౌతం గంభీర్‌తో మైదానం బయట, లోపల అఫ్రిది ఎన్ని సార్లు మాటల యుద్ధానికి దిగాడో మనందరికీ తెలుసు. అంతేకాకుండా, భారత్ పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తుంటాడు. గత ఏడాది ప్రపంచకప్ టోర్నీలో భారత్ పై రాణించలేకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే ‘అది భారత జట్టు అదృష్టం’ అని విలేకరుల సమావేశంలో దీటుగా సమాధానం ఇచ్చాడు. దీంతో భారత్ అభిమానులు అఫ్రిదిని ఓ రేంజ్‌లో సామాజిక మాధ్యమాల్లో ఆడుకున్నారు.
2. అండ్రూ సైమండ్స్
ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ పేరు వినగానే గుర్తుకువచ్చేది ‘మంకీ గేట్ వివాదం’. 2007-08లో భారత్-ఆసీస్ మధ్య టెస్టు సిరీస్‌లో హర్భజన్ తనను ‘మంకీ’ అన్నాడని సైమండ్స్ ఆరోపించాడు. అప్పట్లో ఈ వివాదం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో భజ్జీకి భారత అభిమానులు అండగా నిలిచారు. ఈ వివాదంతో సైమండ్స్ మనకు శత్రువయ్యాడు.
3. ఆండ్రూ నెల్
2006 దక్షిణాఫ్రికాకు చెందిన ఆండ్రూ నెల్ బౌలింగ్‌లో శ్రీశాంత్ కొట్టిన సిక్స్ ఎప్పటికి మరిచిపోను. శ్రీశాంత్‌ను కవ్వించి మరీ నెల్ సిక్స్ కొట్టించాడు. సిక్స్ కొట్టిన అనంతరం శ్రీశాంత్ తన బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ మనం ఎలా మరిచిపోతాం చెప్పండి. ఈ వివాదం కారణంగా నెల్‌ను మన అభిమానుల దృష్టిలో విలన్ అయిపోయాడు.
4. సర్ఫరాజ్ అహ్మద్
మరో పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ అంటే కూడా మనవారికి ఇష్టముండదు. ఎందుకంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో టీమిండియా ఘోర పరాభవానికి ఇతడే కారణం. ‘పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ భయపడుతోంది’ అంటూ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు మరో కారణం.
5. అండ్రూ ఫ్లింటాఫ్
ఇంగ్లాండ్ క్రికెట్లో మంచి పేరున్న క్రికెటర్ ఫ్లింటాఫ్. కానీ, మన క్రికెటర్ల పట్ల అతడి స్వభావం, వ్యాఖ్యలు మన అభిమానులకు కోపం తెప్పించాయి. అవేంటంటే వాంఖడే మైదానంలో భారత్‌తో జరిగిన వన్డేలో విజయం అనంతరం ఫ్లింటాఫ్ చొక్కా తీసి గాల్లో ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటనకు గంగూలీ బాగానే బుద్ది చెప్పాడనుకోండి. మరో సంఘటన ఏంటంటే... తొలి T20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్‌ను రెచ్చగొట్టాడు. దీనికి ఫలితమే బ్రాడ్ బౌలింగ్ యువీ వరుస సిక్స్‌లు.
6. జావెద్ మియాందాద్
విధ్వంసరమైన క్రికెటర్లలో మియాందాద్ ఒకడు. అలాంటి క్రికెటర్ భారత్‌తో జరిగిన మ్యాచుల్లో అనుకున్న ప్రదర్శన కనబరచలేకపోవడం, భారత ఆటగాళ్ల పట్ల ప్రవర్తన కారణంగా మన అభిమానుల మనసులో చోటు దక్కించుకోలేకపోయాడు. రిటైర్మెంట్ అనంతరం సచిన్‌ను ఎవరూ గుర్తుపెట్టుకోరంటూ వ్యాఖ్యలు చేశాడు. ఓ మ్యాచ్ సందర్భంగా భారత స్పిన్నర్ దిలీప్ దోషి ఉంటున్న హోటల్ గది నంబర్ తెలుసుకుని అతడికి బంతిని పంపాడు. ఇలాంటి పలు కారణాల వల్ల మియాందాద్ మన అభిమానులకు దూరమయ్యాడు.
7. స్టీవ్ స్మిత్
ప్రస్తుత తరంలో ఉన్న క్రికెటర్లలో గొప్ప ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా స్మిత్‌ని చెప్పుకోవచ్చు. ‘భారత జట్టుపై ఏదైనా సాధించవచ్చు’ అంటూ అతడు చేసిన వ్యాఖ్యలతో పాటు 2015 ప్రపంచకప్‌లో భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించడానికి పరోక్షంగా స్మిత్ కారణం. ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో స్మిత్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో భారత అభిమానులకు ఎన్నో నిద్రలేని రాత్రులకు స్మిత్ కారణమయ్యాడు.
8. ముష్ఫికర్ రహీమ్
2016 ప్రపంచకప్ సందర్భంగా రహీమ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. టోర్నీలో భారత్ తో తలపడిన బంగ్లాదేశ్ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత భారత్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. ఈ సందర్భంగా రహీమ్ ట్విటర్లో సంతోషంగా ఉందంటూ పోస్టు చేశాడు. దీంతో అభిమానులు కోపంతో రగిలిపోయారు.
9. రికీ పాంటింగ్
మైదానంలో రికీ పాంటింగ్ ఎంతో కోపంగా, యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. ఈ ఆసీస్ మాజీ సారథి 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ పై చేసిన సెంచరీ అభిమానుల గుండెల్లో చెరపలేని ముద్ర వేసింది. ఈ సెంచరీతోనే రికీ పాంటింగ్ భారత క్రికెట్ అభిమానులకు దూరం అయ్యేలా చేసింది.
10. గ్రెగ్ ఛాపెల్
బ్యాట్స్‌మెన్‌గా ఛాపెల్ భారత అభిమానులకు శత్రువు కాలేదు. 2004 నుంచి 2007 వరకు మన జట్టుకు ఛాపెల్ కోచింగ్ బాధ్యతలు నిర్వహించాడు. ఇతడి కారణంగానే సౌరవ్ గంగూలీ, ఇర్ఫాన్ పఠాన్ జట్టులో రాణించలేకపోయారు.