Dussehra 2025: విజయదశమి శుభ ముహూర్తం, పూజా విధానం, రావణ దహనం సమయం!
Vijayadashami 2025: అక్టోబర్ 2న రావణ దహనం, విజయదశమి. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. ఇది సత్యానికి విజయానికి ప్రతీక.

Dussehra 2025: ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు పూర్తైన తర్వాత చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం విజయదశమి పండుగ అక్టోబర్ 2న వచ్చింది.
వైదిక పంచాంగం ప్రకారం, అశ్వినీ మాసం శుక్ల పక్షం దశమి తిథి అక్టోబర్ 01 బుధవారం మధ్యాహ్నం 2 గంటల 22 నిముషాల నుంచి ప్రారంభమై.. అక్టోబరు 02 మధ్యాహ్నం 2 గంటల 45 నిముషాల వరకూ ఉంటుంది. ( ప్రాంతాల ఆధారంగా సమయంలో మార్పులుంటాయి)
సూర్యోదయానికి తిథి ఉండడం ప్రధానం..అందుకే అక్టోబరు 02న దసరా జరుపుకుంటారు. దసరా రోజు రావణదహనం ప్రదోష కాలంలో చేస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయం తెలుగు రాష్ట్రాల్లో 5 గంటల 48 నిముషాలకు.
అధర్మంపై ధర్మం విజయం
ప్రతి సంవత్సరం దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా రోజు శ్రీరాముడు రావణుడిని వధించి యుద్ధంలో విజయం సాధించాడు. ఈ పండుగను అసత్యంపై సత్యం.. అధర్మంపై ధర్మం విజయంగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు.ఈ రోజున దుర్గా దేవి మహిషాసురుడిని వధించిందని పురాణకథనం..అందుకే శారదీయ నవరాత్రి దశమి తిథిని ఈ ఉత్సవం జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో రావణ దహనం జరుగుతుంది.
ఈ రోజున ఆయుధాల పూజతో పాటు శమీ చెట్టును కూడా పూజిస్తారు.
ఈ రోజున వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, బంగారం, ఆభరణాలు, కొత్త బట్టలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు
దసరా అక్టోబర్ 2, 2025
దసరా రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:38 నుంచి ఉదయం 05:26 వరకు ఉంటుంది
ఈ రోజున మధ్యాహ్నం పూజ ముహూర్తం మధ్యాహ్నం 01:21 నుంచి మధ్యాహ్నం 03:44 వరకు
శుభ యోగం
విజయదశమి రోజున శ్రవణ నక్షత్రం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం ఈ యోగం ఏర్పడుతోంది. దసరా రోజున సుకర్మ ధృతి యోగం ఉంటుంది. ఈ రోజున రవి యోగం రోజంతా ఉంటుంది. హిందూ మతంలో ఈ గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
ఆయుధ పూజ ముహూర్తం
దసరా రోజున చాలా చోట్ల ఆయుధాలను పూజించే ఆచారం కూడా ఉంది. దసరా రోజున ఆయుధ పూజ విజయ ముహూర్తంలో చేస్తారు. ఈ రోజున ఆయుధ పూజకు శుభ ముహూర్తం మధ్యాహ్నం 02:09 నుంచి మధ్యాహ్నం 02:56 వరకు ఉంటుంది. పూజ మొత్తం వ్యవధి 47 నిమిషాలు.
రావణ దహన ముహూర్తం
దసరా రోజున లంకాధిపతి రావణుడు ,సోదరుడు కుంభకర్ణుడు , కుమారుడు మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. దిష్టిబొమ్మలను సరైన సమయంలో దహనం చేస్తేనే శుభప్రదంగా భావిస్తారు. రావణ దహనం ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో చేయడం శాస్త్ర సమ్మతం. రావణదహనం చేసి ఇంటికి వచ్చిన పురుషులకు..స్త్రీలు హారతి ఇచ్చి తిలకం దిష్టితీస్తారు.
వివిధ ప్రదేశాల్లో దసరా పండుగను వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు. ఆయుధాలను ఉపయోగించేవారు ఆయుధాలకు, వాహనాలకు పూజచేస్తారు.
కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. చాలా చోట్ల దసరా రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. శుభ కార్యాలకు ఈ రోజు శుభప్రదంగా పరిగణిస్తారు. దసరా లేదా విజయదశమిని సర్వసిద్ధిదాయక తిథిగా భావిస్తారు. అందువల్ల, ఈ రోజున చేసే అన్ని శుభ కార్యాలు ఫలవంతంగా ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు చేయకూడని పనులివే
దసరా రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయకూడదు
ఇల్లు లేదా దుకాణం నిర్మాణం చేయకూడదు
గృహ ప్రవేశం చేయకూడదు
ముండనం లేదా నామకరణం చేయకూడదు
అన్నప్రాసన లేదా కర్ణ ఛేదనం చేయకూడదు
యజ్ఞోపవీత సంస్కారం,భూమి పూజ వంటివి శుభప్రదంగా పరిగణించబడతాయి...విజయదశమి రోజున వివాహం చేసుకోకూడదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.





















