విధుర నీతి: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? సర్వనాశనమైపోతారు
విదుర నీతిలో సంతోషకరమైన జీవితం కోసం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా వివరించాడు. అవేమిటో తెలుసుకుందాం.
దృతరాష్ట్ర సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధాన మంత్రి విదురుడు. సునిశిత ఆలోచనా ధోరణి, దార్శనికత కలిగిన గొప్ప మేధావి. సరళమైన ప్రశాంత చిత్తం కలిగిన స్థిత ప్రజ్ఙత కలిగిన రాజకీయవేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడు . మహా రాజు దృతరాష్ట్రుడు ముఖ్య విషయాలన్నింటికీ విదురుడిని సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదుర నీతిగా ప్రాచూర్యంలో ఉన్నాయి. అనేక జీవిత సత్యాలను విదురుడు దృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. అందులో భాగంగా జీవన విధానం, ధనం, కర్మ వంటి అనేకానేక విషయాల గురించిన వివరణలు ఇచ్చాడు. విదుర నీతిలో సంతోషకరమైన జీవితం కోసం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో కూడా వివరించాడు. అవేమిటో తెలుసుకుందాం.
- ఎలాంటి స్థితిలోనూ గర్వం పనికిరాదు. తనను తాను ఇతరులకంటే ఎక్కువగా భావించే వ్యక్తి అహంకారి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎవరికీ నచ్చరు. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలి.
- తక్కువ మాట్లాడడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసో తెలియకో తప్పులు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందుకే అవసరానికి మించి మాట్లాడక పోవడమే మంచిది. ఈ లక్షణం మిమ్మల్ని వివాద రహితులుగా చేస్తుంది. అందుకే అతిగా మాట్లాడటం అనర్థదాయకం అని విదురనీతి సారాంశం.
- అతిగా లేదా తరచుగా కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. కోపంలో మాట్లాడే మాటలకు, చేతలకు ఇతరులే కాదు స్వయంగా వారికి కూడా నష్టం జరగవచ్చు. ఆగ్రహించిన వారికి ఆయుష్షు తగ్గిపోతుందని విదుర నీతి చెబుతుంది.
- నమ్మిన వారిని మోసం చెయ్యడం ఎప్పుడూ మంచిది కాదు. నమ్మిన వారికి ద్రోహం చెయ్యడం వల్ల మీకు మరే హాని చేసుకున్నట్టు అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. నమ్మక ద్రోహం మొదటికే మోసం అని విదుర నీతి వివరిస్తుంది.
- ఆశ అందలాన్ని అందుకునే బలాన్ని ఇస్తే అత్యాశ అధఃపాతాళానికి తోసేస్తుంది. దురాశ దుఃఖానికి చేటవుతుందని విదుర నీతి చెబుతోంది. అతిగా ఆశ పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. అత్యాశ పాపాలు చేయిస్తుంది. దురాశ మిమ్మల్నే నాశనం చేస్తుంది.
విదురుడు చెప్పిన జీవిత సత్యాలు ఎప్పుడూ ఆచరణీయాలే. కొన్ని చిన్నచిన్న విషయాలే జీవితంలోకి పెద్ద పెద్ద ఆనందాలను తెస్తాయి. విదురుడు చెప్పినట్టు అవసరానికి మించి మాట్లాడకపోవడం వల్ల అనర్థాల పాలు కాకుండా కాపాడుకోవడం ఇప్పటికీ సాధ్యమే. తరచుగా కోపం తెచ్చుకునే వారు ప్రియమైన వారిని దూరం చేసుకోవడమే కాదు విదుర నీతి చెప్పినట్టు కోపం ఆయుక్షీణానికి కారణమవుతుందని సైన్స్ కూడా నిరూపిస్తూనే ఉంది. నమ్మిన వారికి చేసే మోసం ఎప్పడూ జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వదు. ఏదో ఒక రోజు మన దు:ఖానికి మనం చేసిన నమ్మక ద్రోహం కారణం కాక మానదు. భవిష్యత్తు మీద ఆశ జీవితానికి ఆధారం అయితే అర్హతకు మించిన ఆశ ఎప్పటికీ దుఃఖానికి హేతువు అవుతుందనేది జగమెరిగిన సత్యం.
Also Read : అమెరికాలో కాదు, అపోలోలో ఉపాసన డెలివరీ - ఇండియన్ డాక్టర్లకు తోడు అమెరికన్ గైనకాలజిస్ట్