(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips in Telugu: వంట గదిలో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు - సమస్యలు వెంటాడుతాయ్!
కొన్ని వస్తువులు కిచెన్‌లో ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టం జరుగుతుందని వాస్తు వివరిస్తోంది. కాబట్టి, అలాంటివి మీ వంటగదిలో ఉండకుండా జాగ్రత్త పడడం అవసరం. ఆ వస్తువులు ఏమిటి? ఎందుకు కిచెన్ లో ఉండకూడదో చూడండి.
వాస్తు ఇల్లు, ఇంట్లోని వస్తువుల అమరిక వంటి అన్ని విషయాలను వివరిస్తుంది. ప్రతి గదికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. వాటిని అనుసరించి ఇంటిలోని వస్తువులను అమర్చుకోవాలి.
వాస్తు వివరణల ప్రకారం ఇంట్లోని కిచెన్.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖ సంపదల వృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వాస్తు చెప్పిన ప్రకారం కొన్ని రకాల వస్తువులు కిచెన్ లో అసలు ఉంచుకోవద్దు. ఈ వస్తువులు కిచెన్ లో ఉండడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట. ఆర్థిక సమస్యలు వేధిస్తాయట. అటువంటి వస్తువులు మీ వంట గదిలో కూడా ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి.
ఖాళీ డబ్బాలు
ఖాళీ డబ్బాలు ఇంట్లో పెట్టుకుంటే అవి వాస్తు దోషానికి కారణం అవుతాయి. ఖాళీ డబ్బాలు లేమికి ప్రతీకలుగా వాస్తు భావిస్తుంది. ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే తప్పకుండా కిచెన్ లో వంటసామాగ్రీకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తపడాలి. ఇలా వంటచేసుకునేందుకు అవసరమయ్యే అన్ని దినుసులు నిండుగా ఉండడం కలిమికి సంకేతం.
పాడైపోయిన ఆహారం
ఎక్సపైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు, పాచిపోయిన పదార్థాలు ఇంట్లో ఉంచుకోవద్దు. ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం దరిద్రానికి సంకేతంగా మారుతుంది. ఖర్చులు పెరిగి ఇంట్లో సంపద తరిగిపొయ్యేందుకు ఇదొక కారణం కాగలదు. కనుక పాడైపోయిన పదార్థాలను ఎప్పటికప్పుడు బయట పడెయ్యడం మంచిది.
పదునైన వస్తువులు
కిచెన్ లో ఉపయోగించే కత్తులు, కత్తిపీటలు, కత్తెరల వంటి పదునైన వస్తువులను ఉపయోగించి అలాగే వదిలెయ్యకూడదు. వాటిని వెంటనే శుభ్రపరిచి సరైన స్థలంలో భద్రపరచాలి. వీటితో ప్రమాదాలు జరగడం మాత్రమే కాదు ఆర్థిక నష్టం కూడా జరగవచ్చని వాస్తు వివరిస్తోంది.
విరిగిన లేదా పగిలిన వస్తువులు
కిచెన్ లో ఉపయోగించే వస్తువుల గురించి పెద్దగా శ్రద్ధ చూపరు చాలా మంది. ఎలా ఉంటే అలాగే పని కానిస్తుంటారు. కానీ ఇవి మీ కిచెన్ అందాన్ని పాడు చెయ్యడమే కాదు వంటకు అసౌకర్యంగానూ ఉంటాయి. విరిగిపోయిన గరిటెలు, కప్పులు ఇతర సామాగ్రిని కిచెన్ నుంచి విరిగిన వెంటనే తొలగించాలి. ఇలా విరిగిన వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. కుంటుంబ అభివృద్ధి కుంటుపడుతుంది కూడా.
వాడకంలో లేని కిచెన్ సామాగ్రి
చాలా రోజులుగా వాడని సామాగ్రి ఏదైనా కిచెన్ లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది. ఎందుకంటే ఇవి కిచెన్ లో స్థలం ఆక్రమించడమే కాదు, నెగెటివ్ ఎనర్జీ కేంద్రాలుగా మారుతాయి. ఫలితంగా ఇంట్లో లక్ష్మి నిలవదు. ఖర్చులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వంటింట్లో ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రిక్ మరే ఇతర సామాగ్రి ఉన్నట్టయితే దాన్ని వీలైనంత త్వరగా తీసెయ్యడమో లేదా బాగు చేయించి వాడుకోవడమో చెయ్యాలి.
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.