ఇంటికి అదృష్టం తెచ్చే ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో తప్పక తెచ్చుకోండి
ఒక్కొక్కరు ఒక్కోరకంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. కొన్ని వస్తువులు ఇంట్లోకి అదృష్టాన్ని తెస్తాయని అంటుంటారు. అలాంటి వారికోసం ఇక్కడ అదృష్టాన్నిచ్చే కొన్ని వస్తువుల జాబితా మీకోసం.
డిసెంబర్ నెల మొదలైందంటేనే పండుగల వాతావరణం మొదలైనట్టు ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, వాటిని ఎలాగైనా విజయవంతంగా పూర్తి చెయ్యాలనే ఆరాటం అందరికీ ఉంటుంది. అందుకు తగిన ప్రణాళికలు, కొనాల్సిన కొత్త వస్తువులను చూస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. కొందరు కొత్త వస్తువులు కొంటారు. కొన్ని వస్తువులు ఇంట్లోకి అదృష్టాన్ని తెస్తాయనే నమ్మకాలు కూడా ఉంటాయి. అలాంటి వారికోసం ఇక్కడ అదృష్టాన్నిచ్చే కొన్ని వస్తువుల జాబితా మీకోసం.
తాబేలు ప్రతిమ
తాబేలు సుఖశాంతులకు ప్రతీకగా వాస్తు చెబుతోంది. తాబేలు కుబేరునికి ప్రతీక. సంవత్సర ఆరంభంలో లోహపు తాబేలు ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందని నమ్మకం. అప్పటి వరకు ఆలస్యమైన పనులు కూడా పూర్తవుతాయట. అందుకే జనవరి 1న ఇత్తడి, వెండి లేదా గాజు తాబేలును ఇంటికి తెచ్చుకోవడం లాభం అని పండితులు చెబుతున్నారు.
ముత్యపు చిప్ప
ముత్యపు చిప్పను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టినవే కనుక ఇవి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనవని ప్రతీతి. సంవత్సరం మొదటి రోజున దీన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో ధనానికి లోటుండదట. జనవరి 1న ముత్యపు చిప్ప పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బుదాచే చోట పెడితే డబ్బుకు లోటు ఉండదని పండితులు సలహా ఇస్తున్నారు.
చిన్న కొబ్బరి
సంవత్సరం ప్రారంభపు రోజున చిన్న ఎండు కొబ్బరి తెచ్చి పెట్టుకుంటే అదృష్టం అని శాస్త్రం చెబుతోంది. వాస్తును అనుసరించి ఎండు కొబ్బరి కానీ, పచ్చికొబ్బరి లేదా కొబ్బరి బోండాం ఏదైనా సరే లక్ష్మీ ప్రతీక. అందుకే పూజల్లో కొబ్బరి కాయకు ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది. కొబ్బరి కాయ కొట్టకుండా పూజ పూర్తికాదు. చిన్న ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పూజలో ఉండి తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
తులసి మొక్క
తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు, ఔషద మొక్క కూడా. అందుకే ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు. పూజించుకుంటారు. ఇంట్లో తులసి ఉన్న ఇల్లు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని ప్రతీతి ఎవరి గృహములో తులసి మొక్క ఉన్న గృహం తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది. ఇప్పటి వరకు ఇంట్లో తులసి మొక్క పెట్టుకోని వారు జనవరి1న కొత్త తులసి మొక్క తెచ్చుకొని పూజలో పెట్టుకొని దాన్ని కుండిలో నాటుకొని ఇంట్లో లేదా వాకిట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి లక్ష్మిని ఆహ్వానించినట్టు ఉంటుంది. తులసి ఇంట్లో సుఖశాంతులను తెచ్చే వరప్రదాయిని.
నెమలి ఈకలు
నెమలి ఈకలు శ్రీకృష్ణుని కి చాల ప్రీతిపాత్రమైనవి. అందుకే ఆయన నెమలి పించాన్ని తలమీద ధరించేవాడు. ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన కృష్ణుడి ప్రీతి పాత్రమైన నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకు కూర్చుంటుందని నమ్మకం. అందుకే ఈ జనవరి 1న నెమలి పించం తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే ఇంట్లో సిరుల వాన కురుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది
Also Read: మనీ ప్లాంట్, తులసి మొక్కలతో జాగ్రత్త - ఈ పొరపాట్ల వల్ల కష్టాలు, నష్టాలు వేధిస్తాయ్!