Tirumala: శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె.. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేడు ముగియనున్నాయి.
Tirumala: చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేడు చివరిరోజుకు చేరుకున్నాయి. చివరి రోజైన బుధవారం నాడు పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి తిరుచానూరు ఆలయానికి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం ఉదయం 4:30 గంటలకు శ్రీవారి ఆలయంలో పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు..
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపుగా గజాలపై ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించాంచారు. అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు ఉదయం 6 గంటలకు తీసుకుని వచ్చారు. అలిపిరి నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సారె చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు వాహన మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించి, ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఏకాంతంగా వాహన మండపంలో పంచమితీర్థం చక్రస్నానంను అర్చకులు నిర్వహించనున్నారు.
Also Read: Tirupati: ఆ ఊర్లో ఎటు చూసినా పలకరించేది సమస్యలే
అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాజ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ అశ్వం సాక్షి గా నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని నమ్ముతారు.
Also Read: Tiruchanoor Temple: సూర్యప్రభ వాహనంపై సిరులతల్లి పద్మావతి.. భక్తులకు కన్నుల పండుగ