Tirumala: తిరుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా!
Secrets in Tirumala Alipiri Footpath: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లేభక్తులు చాలామంది అలిపిరి మెట్లదారిలో స్వామి సన్నిధికి చేరుకుంటారు. అయితే ఈ మార్గంలో ఎన్ని అద్భుతాలున్నాయో గమనించారా?

Tirumala: అలిపిరి మొదలు ఏడుకొండలపై ఉన్న స్వామివారి దర్శనం వరకూ మెట్లదారిలో వెళ్లే భక్తులకోసమే ఈ కథనం. ఆ మార్గంలో మీరు దర్శించుకోవాల్సిన ప్రదేశాలు, వాటి విశిష్టత ఇక్కడుంది..
అలిపిరి
అడి పులి అనే తమిళ పదాల నుంచి వచ్చింది. పులి అంటే తమిళంలో చింతచెట్టు , అడి అంటే కొండ కింద అని...కొండకింద ఉన్న చింత చెట్టు అని అర్థం. అది ఆదిశేషుడి అంశతో ఏర్పడిందని చెబుతారు. వైష్ణవ సంప్రదాయంలో చింతచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ చింతచెట్టుకి గుర్తుగా అలా పిలుస్తారు.
మాలదాసరి విగ్రహం
అలిపిరి మెట్లకి ముందు ఓ విగ్రహం కనిపిస్తుంది..సాష్టాంగం చేస్తూ..అది మాలదాసరి అనే వ్యక్తిది. తమిళనాడుకి చెందిన మహాభక్తుడైన హరిజనుడిది ఆ విగ్రహం. కొండపైకి ఎక్కేముందు సాష్టాంగనమస్కారం చేయమని సూచిస్తూ ఆ భక్తుడి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.
శ్రీవారిపాదాలమండపం
ఇక్కడ నిజపాదదర్శనం లభిస్తుంది. తిరుమలనంబి అనే భక్తుడు రోజూ కొండపైనుంచి కిందకు వచ్చి అలిపిరిలో ఉన్న రామానుజులకు దగ్గరకు వచ్చేవారు. నిత్యం ప్రసాదం నివేదించేందుకు కొండపైకి వెళ్లేవారు. ఓ రోజు గురు శిష్యులు భక్తిలోపడి మునిగితేలుతూ కొండపైకి వెళ్లడం మర్చిపోయారు. నివేదన సమయంలో గంటలు వినిపించడంతో అయ్యో ఆరంగిపు సమయానికి వెళ్లలేదే అని భాధపడ్డారు. అప్పుడు స్వయంగా స్వామివారు తన పాదాలు అక్కడ వెలసేలా చేసి వీటిని దర్శించుకోమని చెప్పారు.
తలయేరుగుండు
పాదాల మండపం దాటిన తర్వాత ఓ రాయి కనిపిస్తుంది. దానిని తలయేరుగుండు అంటారు. మోకాళ్ల నొప్పులున్నవారు వెళ్లి ఆ రాయికి ఆనిస్తే నొప్పులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. రాయి అంటే ఒకే రకమైన ధాతువు కాదు..కొన్నింటికి కొన్ని శక్తులుంటాయని విశ్వసిస్తారు.
గాలిగోపురం
ఖాలీ గోపురం వాడుకలో గాలి గోపురంగా మారింది. ఇక్కడున్న విశేషం ఏంటంటే కోరక్కర్ అనే సిద్ధుడు ఇక్కడకు వచ్చి తపస్సు చేశారట. ఆ పక్కనే సమాధాలుంటాయి. కొంచెం దూరంలో పుష్కరిణి ఉంటుంది. ఆ ప్రాంతంలో చెట్టుకింద ఆయన తపస్సు ఆచరించారట
జింకలపార్క్
కొండెక్కేవాళ్లకి సరదాకోసం కాదు జింకల పార్క్. తిరుమలలో వైఖానస ఆగమంలో యాగాలకు ఆ ప్రాంతంలో కృష్ణ జింకలు ఉండాల్సిందే. అందుకోసం ఏర్పాటు చేసిందే జింకల పార్క్.
ఆంజయనేయస్వామి ఆలయం
జింకలపార్క్ దాటిన తర్వాత కనిపిస్తుంది ఆంజనేయస్వామి విగ్రహం. 1979లో ఘాట్ రోడ్ లో ఓ స్త్రీ హత్య జరిగిందట. మెట్లదారికి బస్సుదారికి మధ్యలో ఉండే ఆ ప్రదేశంలో.. తోగులక్ష్మణస్వామి అనే శిల్పితో ఆంజనేయుడి విగ్రహం చెక్కించి ప్రతిష్టించారు.
నారసింహదేవాలయం
ఆంజనేయుడి ఆలయం దాటి వెళ్లినతర్వాత నారసింహదేవాలయం కనిపిస్తుంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆగ్రహంగా ఉన్న స్వామివారిని శాంతింపచేసేందుకు అమ్మవారు చెంచురూపంలో వెళ్లారట. ఆలయం వెనుక యోగనారసింహస్వామి లింగరూపంలో దర్శనమిస్తారు.
అవ్వాచారి కోన
మెట్లదారి - రోడ్డు దారి కలిసేచోట వచ్చే సుందర ప్రదేశం అవ్వాచారి కోన. నారసింహుడి ఆలయం ఎదురుగా ఉండే విగ్రహం అవ్వాచారిదే అంటారు
తుంబురవనం
ఈ ప్రదేశంలో ఇప్పటికీ రాత్రి రాత్రివేళ గంధర్వులు వచ్చిన గానం చేస్తారట. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఘంటా మండపం
చంద్రగిరిని విజయనగర ప్రభువు రామదేవరాయలు పరిపాలించినప్పుడు స్వామికి నివేదన అయ్యేవరకూ భోజనం చేసేవారుకాదట. అందుకోసం ఆయన స్వయంగా ఏర్పాటు చేసిన ఘంట ఇది అని చెబుతారు. దీనిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి
అక్కగార్ల గుడి
తలుపులు లేని ఈ ఆలయంలో ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉంటారు..వీరు స్వయంగా స్వామివారి అక్కచెల్లెళ్లు అని అంటారు. గ్రామదేవతలు అని కూడా చెబుతారు. మోకాళ్ల పర్వతం ఎక్కేముందు వీరి అనుమతి తీసుకుని వెళ్లాలి అంటారు
మోకాళ్లపర్వతం
రామానుజులు కూడా ఇక్కడి నుంచి కొండెక్కేటప్పుడు మోకాళ్లపై ఎక్కారట. ఇక్కడున్నది శాలగ్రామ శిల అని అందుకే కాళ్లతో తొక్కకూడదు అనే సెంటిమెంట్ ఉంది
భాష్యకారుల సన్నిధి
రామానుజులు మోకాళ్లపై కొండపైకి ఎక్కినప్పుడు ఆయన కాళ్లు చెక్కుకుపోయాయి..అప్పుడు కొండపై ఉన్న తిరుమలనంబి, అనంతాళ్వార్ ఇద్దరూ గురువుగారికి సేవచేసి శ్రీవారికి నివేదన చేసిన రెండు మామిడి పండ్లు అందిస్తారు. ఆ పండ్లు తినేసి పడేసిన టెంకల నుంచి వచ్చిన రెండు చెట్లు అక్కడున్నాయి..
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















