Spirituality: వారంలో ఏడు రోజుల్లో ఏ రోజు శుభం, ఏ రోజు అశుభం
వారంలో మొత్తం 7 రోజులు. ఈ ఏడురోజులకు ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. కానీ కొందరికి కొన్ని రోజులను శుభంగా భావిస్తే, ఇంకొన్ని రోజులను అశుభంగా భావిస్తారు. మరి ఏ రోజుకి ఎవరు అధిపతి, ఏ రోజు ఏం చేయాలి.
ఏ రోజుకి ఎవరు అధిపతి
ఆదివారం
రోజులు లెక్కించే క్రమంలో మొదటగా వచ్చే ఆదివారానికి అధిపతి సూర్యుడు. ‘ఆది’ అంటే మొదటిది అని అర్థం. మొదటగా లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడే కాబట్టి ఆదిత్యుడే ఆదివారానికి అధిపతి. ‘ఆదిత్య హృదయ’ స్తోత్రాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, విజయప్రదాతగా దర్శనమిస్తాడు.
సోమవారం
సోమవారానికి అధిపతి చంద్రుడు. సోముడంటే అమృతాన్ని పుట్టించేవాడు. చంద్రుడి వెన్నెల అమృతంలా ఎన్నో ఓషధులను బతికిస్తోంది. భూలోకానికి అమృత కిరణాలు ప్రసాదిస్తాడు చంద్రుడు. అందుకే సూర్యుడి తర్వాత భూలోకానికి చంద్రుడే ప్రాణప్రదాత. మనశ్సాంతికి చంద్రుడిని పూజిస్తారు.
మంగళవారం
ఈ రోజుకి అధిపతి కుజుడు (అంగారకుడు). ‘కుజ’అంటే భూమి నుంచి పుట్టినవాడు అనే అర్థం ఉంది. ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అనీ పిలుస్తారు. అంగారం అంటే నిప్పు. నిప్పులా ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు. మంగళం అంటే శుభమే కదా..అందుకే కుజుడుని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా
బుధవారం
బుధవారానికి అధిపతి అయిన బుధుడు..చంద్రుడి పుత్రుడిగా చెబుతారు. బుధుడు అంటే సర్వం తెలిసినవాడు, జ్ఞాని, పండితుడు అని అర్థం. అయితే సర్వం తెలిసినా బుధుడు స్వయంగా ప్రవర్తించడంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ని అంటుకుంటాయని చెబుతారు. అంటే స్వయంగా అతడు ప్రవర్తించడు అనే విశ్వాసం ఉంది.
గురువారం
అసలు పేరు బృహస్పతి అయినా దేవతలకు గురువు అయిన కారణంగా బృహస్పతికి గురువు అని పిలుస్తారు. బుద్ధికుశలతకు మారుపేరైన బృహస్పతి సంచారం జాతకంలో బావుంటే సకల విద్యలూ అలవడతాయని విశ్వాసం. సౌర మండలంలో అతిపెద్ద గ్రహం కూడా ఇదే.
శుక్రవారం
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శుక్రవారానికి అధిపతి. మృత సంజీవని (మరణించినవారిని బతికించే విద్య) తెలిసినవాడు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే శుక్రాచార్యుడిని వేగుచుక్కగా కొలుస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు ఈ రోజు ప్రారంభిస్తే చక్కగా ఉంటాయని భావిస్తారు.
శనివారం
శనివారానికి అధిపతి శనైశ్చరుడు. శని గమనం మెల్లగా ఉంటుంది కాబట్టే మందుడు అని కూడా అంటారు. ఛాయా సూర్యుల కుమారుడు...యమధర్మరాజు-యమున సోదరుడు. అన్న యమధర్మరాజు మరణం తర్వాత శిక్షిస్తే, తమ్ముడు శని బతికి ఉండగానే పాప-పుణ్యాల లెక్కలు సెట్ చేస్తాడు. అందుకే శనిని ఆరాధిస్తే చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని విశ్వాసం.
Also Read: తలకిందులుగా ఉండే ఈ శివయ్య దీర్ఘకాలిక రోగాలు నయం చేస్తాడట
ఇలా ఏడువారాలు రోజుకొకరు చొప్పున మన జీవితాల్లో నిత్యం దర్శనమిస్తుంటారు. నిత్యం వారిని తలుచుకుని పూజ చేస్తే ఆయా గ్రహాల అనుగ్రహం ఉంటుంది.తలపెట్టిన పనిబట్టి ఏ రోజు చేయాలి, ఏ రోజు వద్దు అనేది ఆధారపడి ఉంటుంది. కొందరైతే మంగళవారం ఏపనీ చేయరు...ఈ రోజున చేస్తే మారు కోరుతుందనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఈ రోజున ఏ పనీ చేపట్టరు. ఎవరి సెంటిమెంట్ వారిదైనప్పటికీ...మీ మనస్సంకల్పమే గొప్పదనే విషయం గుర్తించండి. మీకు మరీ సెంటిమెంట్ ఉంటే ఆరోజు ఆ దేవుడికి నమస్కారం చేసి పని మొదలుపెట్టండి.